జగన్‌రెడ్డి గానుగెద్దులా ఐపీఎస్, ఐఏఎస్‌లు?

జగన్‌రెడ్డి ఆదేశాలకు తలొగ్గి గాను గెద్దుల్లా పని చేస్తున్నారు ఐఏఎస్, ఐపిఎస్‌లు అధికారులు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి ఆదేశాలు రావడమే తరువాయి సీఐడీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ప్రతిపక్షనాయడు చంద్రబాబుపై కేసులు పెట్టడానికి పరుగెత్తుకు వస్తున్నారు. అమరావతిలోని అన్ని రోడ్లను కలుపుతూ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వేయాలని గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. కానీ నిర్ణయించడం తప్ప రోడ్డు వేయలేదు. కనీసం దాని కోసం భూ సేకరణ కూడా చేయలేదు. రోడ్డే లేకుండా రూ.2 వేల కోట్ల కుంభకోణం అంటూ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం ఆయన ఆదేశాలతో ఆధారాలు లేకుండా ఊహలతో సిఐడి అధికారులు కేసులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి  తలుచుకుంటే కనీస ఆధారాలు లేకపోయినా ఎవరిపైన అయినా కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించ వచ్చునని జగన్మోహన్‌ రెడ్డి రుజువు చేశారు. 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించి ఏ ఆధారాలు చూపకుండా ఆయనను రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో నిర్బంధించారు. మళ్ళీ ఇప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులోఅరెస్టు అయి జ్యూడిషియల్ రిమాండ్‌లో వున్న చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డ్ ఎలైన్‌మెంట్ కేసులో సిఐడి అధికారులు పీటీ వారంట్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరుగుతుండగానే సంబంధం లేకుండా ఇన్నర్ రింగ్ రోడ్డ్ కేసులో లోకేష్‌ను నిందితుడుగా చేర్చారు. ఒక దాని తర్వాత మరొకటి అన్నట్లు అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును, లోకేష్‌లను ప్రజల్లోకి వెళ్లకుండా చెయ్యడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం కుట్రలకు తెర లేపింది. 
ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో సీఐడీ మోపిన కేసుపై తెలుగుదేశం పార్టీ  సవివరంగా  నివేదిక విడుదల చేసింది. 

సీఐడీ తప్పుడు ఆరోపణలకు నిర్దిష్టంగా సమాధానాలిచ్చింది. ఇది రాజకీయ ప్రేరేపితం,కల్పితం తప్ప వాస్తవాల ఆధారంగా పెట్టిన కేసు కాదని స్పష్టం అవుతున్నది. ఊరూ పేరూ లేని వారి తరపున థర్డ్‌ పార్టీ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయవచ్చా? అలా అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నిర్ణయం వల్ల తమకు నష్టం జరిగిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు పెడతారా? వాటి వల్ల అయాచితంగా లబ్ధి పొందిన వారు ఎవరో నిర్ధారించకుండా కేసులు పెట్టుకుంటూ పోతే అధికార యంత్రాంగం పని చేయగలదా? స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలదా? పరిపాలన పక్కన పెట్టి చంద్రబాబు, లోకేష్‌లను ఏయే కేసులలో ఇరికించేందుకు, కేసులను శోధించడమే జగన్‌ ప్రభుత్వం దినచర్యగా మారింది. 

    
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రజా రాజాధాని నగర నిర్మాణానికి సింగపూర్‌కు చెందిన ప్రభుత్వ సంస్థ మాస్టర్‌ప్లాన్‌ ఇచ్చింది. ఆ తర్వాత రాజధాని నగర ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) కోసం సీఆర్‌డీఏ ఆరు నెలలకు పైగా సంప్రదింపులు జరిపింది. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ పూర్తి పారదర్శకంగా జరిగింది. దాదాపు 1100 మందిని సంప్రదించి వారి అభిప్రాయాలు క్రోడీకరించి రూపొందించారు. అయినా ముఖ్యమంత్రి జగన్ మెప్పుకోసం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నిరాధార అసంబద్ధ ఆరోపణలతో సిఐడికి పిర్యాదులు చేస్తూనే వున్నారు. అమరావతిని అటకెక్కించి, మాస్టర్ ప్లాన్‌ను తుంగలో తొక్కేశారు. గీతల్లోనే ఉన్న ఇన్నర్ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌పై అక్రమాలు జరిగాయని చంద్రబాబుపై ప్రభుత్వం సీఐడీ కేసు పెట్టడం చూస్తే  జగన్ రెడ్డి ఎంత కక్షతో రగిలి పోతున్నారో అర్ధం అవుతుంది. ఇంత వరకు ఇన్నర్ రింగ్‌ రోడ్డు విషయంలో ఆరోపణలు రాలేదు. ప్రజల నుంచి వ్యతిరేకత అసలే లేదు. గతంలో అలైన్‌మెంట్‌ నిర్ణయించినప్పుడు గానీ. ఆ తర్వాత గానీ వచ్చిన అభ్యంతరాలు కూడా లేవు. అక్రమ కేసులకు ఆంధ్రప్రదేశ్ సిఐడి కార్యాలయం అడ్డాగా మారింది. సిఐడికి గాలి పోగేసి.. గాలి కేసులు పెట్టడం అలవాటుగా మారింది. కేసులు పెట్టడానికి ఏమి దొరక్క ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు, అవినీతి అంటూ మరొక నాటకానికి శ్రీకారం చుట్టారు. అధికార పార్టీ పిర్యాదు చెయ్యడమే ఆలస్యం విచారణ లేకుండా ప్రతిపక్షాన్ని వేధించడమే లక్ష్యంగా పని చేస్తున్నదీ సిఐడి. 
రాజధాని అమరావతి కోసం పైసా ఖర్చు లేకుండా దాదాపు 30 వేల ఎకరాల భూమిని సమీకరించడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా జరిగిందని దేశవ్యాప్తంగా ప్రశంసలు సైతం వెల్లువెత్తాయి. చంద్రబాబు ఆ పని చేశారు కనుక రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరిట భూ కుంభకోణం జరిగిందన్న ప్రచారాన్ని ఎత్తుకున్నారు 

సీఐడీ అధికారులు ఏదో ఒక కేసు నమోదు చేయడం, దానిపై చంద్రబాబు కోర్టులను ఆశ్రయించవలసి రావడం జరుగుతూనే ఉంటుంది. అత్యున్నతమైన ఐపిఎస్‌ల, ఐఏఎస్‌ల వ్యవస్థ జగన్‌రెడ్డి ఇంటి ముందు గానుగెద్దులుగా పని చేస్తున్నారు. అఖిల భారత సర్వీస్ అధికారుల్లో విలువలు క్షీణించి ముఖ్యమంత్రి అభీష్ట కామ్యార్ధ సిద్ది కోసం గులాం గిరి చేస్తున్నారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం అత్యున్నత వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చారు. అఖిల భారత సర్వీస్ చట్టం ప్రకారం ఈ అధికారులకు విశేషాధికారాలు వున్నాయి. అఖిల భారత సర్వీసు అధికారులు సర్వీసులో చేరే ముందు రాజ్యాంగాన్ని. చట్టాలను గౌరవిస్తామని ప్రమాణం చేస్తారు. కానీ నేడు ప్రజా ప్రయోజనాలు. రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తూ, నిజాయితీతో రాజ్యాంగ నిబంధనలు పాటీంచాల్సిన అవసరాన్ని ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు గుర్తించడం లేదు. 

అఖిల భారత సర్వీస్ అధికారులకు రాజ్యాంగ నిర్మాతలు కల్పించిన హక్కులు. అధికారాలు సామాన్యమైనవి కావు. ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకొన్నా అడ్డుపడే అధికారం బిజినెస్ రూల్స్ రూపంలో ఐఏఎస్‌లకు దాఖలు పడింది. నిబంధనలు ఒప్పుకోవంటూ ముఖ్యమంత్రుల పార్మెంట్‌నే సున్నితంగా తిరస్కరించిన అధికారుల శకం అంతరించి రాజకీయ బాసులతో కలసి అవినీతి మడుగులో ఈదులాడటం, ప్రతిపక్షాలను వేధించడం, సభలను అడ్డుకొనే సంతతి నేడు ప్రజాస్వామ్య నవనాడులను కుళ్లబొడుస్తోంది.. కానీ ఎన్నడూ లేని విధంగా ఐఏఎస్, ఐపిఎస్‌లు జగన్ ప్రభుత్వానికి వీర విధేయత చూపించి వీర గంధాలు పూస్తున్నారు. ఏ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఇంత నీచంగా వాడుకొన్న పరిస్థితి   లేదు. ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తమైంది, ఆర్ధికంగా దివాళా తీసింది. పాలన పరంగా చిన్నాభిన్నమైంది. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను బలి పెడుతున్న ప్రభుత్వానికి ఐఏఎస్, ఐఫిఎస్ అధికారులు సహకరిస్తున్నారు. సొంత ప్రయోజనాల కోసం నేలబారుగా వ్యవహరించి దేశంలోనే అత్యున్నత అఖిల భారత సర్వీస్ వ్యవస్థకు తలవంపులు తేవడం మానుకోవాలి. ముఖ్యమంత్రి మెప్పుకోసం అత్యున్నత వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చుతున్నారు. అఖిల భారత సర్వీస్ అధికారుల సంఘం కూడా దిగజారిన ప్రస్తుత వ్యవస్థ పనితీరును చక్కదిద్దెందుకు నడుం బిగించే చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఉంది.        

 నిబద్దతతొ పనిచేసే యంత్రాంగం అంతరించి స్వామి కార్యంతొ పాటు స్వకార్యాన్ని సాధించుకొంటూ తరిస్తున్నారు. ప్రతిష్టాత్మక సివిల్.సర్వీస్ వ్యవస్థలో రుగ్మతలు రూపు మాపి.. విలువలు పునరుద్దరించాలని. తాము కోల్పోయిన ప్రజా విశ్వాసాన్ని పునరుద్దరించు కొవాలని, దాపరికం లేని విధానాలు అవలంభించాలని దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల సదస్సులో  తీర్మానించి ఏళ్ళకు ఏళ్లు గడిచింది. ప్రభుత్వానికి చుక్కానిగా  వ్యవహరించవలసిన సివిల్ సర్వీస్ అధికారుల వ్యవహర శైలి మార్చి వ్యవస్థనే రాజకీయ సాధనంగా దిగజార్చిన వైనం తాలుకా దుష్పలితాలు జగన్ పాలనలో కళ్ళకు కడుతున్నాయి. అధికారులు రాజకీయ దినుసులుగా మారడం వల్లనే పాలనలో నైతిక ప్రమాణాలు  దిగజారాయి. నేడు జగన్ పాలనలో ఐ.ఏ.ఎస్. ఐపిఎస్‌ల ప్రతిష్టకు గ్రహణం పట్టించారు. జగన్ పాలనలో పౌరసేవలు రాజకీయ సర్వీసులుగా మారిపొయిన వాస్తవాలు ఎన్నో కళ్ళకు కడుతున్నాయి. ఒత్తిళ్లను  ప్రతిఘటించ లేని ఐ.ఏ.ఎస్. ఐ. పి.ఎస్‌లు సర్వీస్‌లో కొనసాగడం వల్ల ఎవరికి ప్రయోజనం.  ప్రజల, రాష్ట్ర ప్రయోజనాల కొరకు కాకుండా తమ ప్రయోజనాలే పరమావధిగా వ్యవరించడం అఖిల భారత సర్వీస్ వ్యవస్థకే అవమానకరం. పాలకులకు గులాంగిరి చేసే బదులు ప్రజలకు. విధేయులుగా ఉంటే ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ అధికారులను ఎవరూ ఏమి చేయ్యలేరు. అంతేకాదు.. అటువంటి వారికి ప్రజలే అండదండగా ఉంటారన్నది మాత్రం వాస్తవం. 

గతంలో ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు పై పెత్తనం చెయ్యడానికి రాజకీయ నాయకులు భయపడే వారు. ఆయా అధికారులు కూడా నిబద్దతతో నిజాయితీగా ప్రజల కోసం కష్టపడే వారు. ఇప్పుడు పోస్టింగులు కోసం అడ్డమైన పనులు చెయ్యడానికి కూడా ఆలిండియా సర్వీస్ అధికారులు వెనకాడటం లేదు. కీలక పోస్టింగ్‌ల కోసం పాలకుల అడుగులకు మడుగులోత్తే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఫలితంగానే ప్రతిపక్షాలపై కక్ష సాధించేందుకు ప్రభుత్వానికి ఉపయోగ పడుతున్నారు. తన పేరిట జీఓలు జారీ చేసే అధికారాన్ని ప్రభుత్వ కార్యదర్శులైన ఐఏఎస్‌లకు గవర్నర్ వ్యవస్థ కట్టబెట్టడం వారిపై ఉన్న నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం. తమపై అంతటి నమ్మకంతో అధికారం కట్టబెట్టిన విషయాన్ని ఐఏఎస్‌లు విస్మరించడం ఎంత వరకు సమంజసం? ముఖ్యమంత్రి చెప్పాడని నిబందనలకు విరుద్దంగా జీఓలు జారీ చేసే పక్షంలో అందుకు ఐఏఎస్ అధికారులు ఎందుకు? సాధారణ ఉధ్యోగులు కూడా సరిపోతారు కదా? జగన్ పాలనలో ఐపిఎస్‌లు.. వై పీఎస్‌లుగా, ఐఏఎస్‌లు.. అయ్యా ఎస్‌లుగా మారి పోయ్యారు. ప్రభుత్వం ఇష్టాను సారం, అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.ముఖ్యమంత్రి మెప్పు కోసం అత్యున్నత ఐఏఎస్ అధికారి నెలబారుగా వ్యవహరించడం భాధ్యతా రాహిత్యం. ప్రజలకు విధేయులుగా ఉండాల్సిన అధికారులు పాలకులకు విధేయులుగా మారడం వల్లనే జగన్ పాలనలో  ఐఏఎస్, ఐపిఎస్‌ల పని తీరు పూర్తిగా మసక బారింది.     

ఐఏఎస్ అధికారులను కోర్టుకు పిలిపించడమే కాదు న్యాయస్థానం జైలు శిక్షలు విధించింది. తమ ఆదేశాలను లెక్క చెయ్యని అధికారులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అధికార పార్టీ  ఒత్తిళ్లకు లొంగి పోయి తప్పులు చేస్తూ హైకోర్టుతో చీవాట్లు తిని, శిక్షలు వేయించుకొని అఖిల బారత సర్వీసుల వ్యవస్థను చులకన చేశారు. ఆ మధ్య రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా సరిగా అమలు అయ్యేలా చూడాలంటూ రాష్ట్ర డీజీపీని హైకోర్టుకు పిలిపించి మరీ చెప్పాల్సి వచ్చిందంటూ  పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. పోలీసు అధికారులు, అధికారుల్లా కాకుండా జగన్ జేబు సంస్థగా మారడం వల్లనే ఈ దుస్థితి. పోలీసు వ్యవస్థను అదుపు చెయ్య లేకపోతే డిజిపి రాజీనామా చేయాలని కూడా హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. గతంలో కూడా అధికారంలో వున్న పార్టీలకు ఐఏఎస్,ఐపిఎస్‌లు అనుకూలంగా వ్యవహరించడం సహజమే. కానీ ఎన్నడూ లేని విధంగా ఐఏఎస్, ఐపిఎస్‌లు జగన్ ప్రభుత్వానికి  వీర విధేయత చూపించి వీర గంధాలు పూస్తున్నారు. ఏ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను, ఐఏఎస్‌ల వ్యవస్థను ఇంత నీచంగా వాడుకొన్న పరిస్థితి  లేదు. ఆంధ్రప్రదేశ్ అస్త వ్యస్తమైంది, ఆర్ధికంగా దివాళా తీసింది. పాలన పరంగా చిన్నాభిన్నమైంది. 

రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను బలి పెడుతున్న ప్రభుత్వానికి ఐఏఎస్ అధికారులు సహకరిస్తున్నారు. ఐ ఏ ఎస్ అధికారులు అధికార పార్టీ నాయకుల ఆదేశాలను గుడ్డిగా ఆచరించే విధానానికి స్వస్తి చెప్పి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. సొంత ప్రయోజనాల కోసం నెలబారుగా వ్యవహరించి అత్యున్నత అఖిల భారత సర్వీస్ వ్యవస్థకు తలవంపులు తేవడం మానుకోవాలి. ముఖ్యమంత్రి మెప్పుకోసం అత్యున్నత వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చ కండి. అఖిల భారత సర్వీస్ అధికారుల సంఘం కూడా దిగజారిన ప్రస్తుత వ్యవస్థ పనితీరును చక్కదిద్దడానికి ప్రయత్నించాలి. రానున్న రోజుల్లో ప్రభుత్వం మారితే ఐపిఎస్‌లు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.  

                                                                                                                                                                 నీరుకొండ ప్రసాద్ 
9849625610

Online Jyotish
Tone Academy
KidsOne Telugu