హాస్టళ్ల నుంచి విద్యార్థులను ఖాళీ చేయించొద్దు!తెలంగాణ డీజీపీ
posted on Mar 26, 2020 10:40AM
లాక్‌డౌన్ నేపథ్యంలో హాస్టళ్లలో ఉండే విద్యార్థులను ఖాళీ చేయించొద్దని నిర్వాహకులకు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. హాస్టల్‌లో ఉండే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపొద్దని అధికారులను ఆయన ఆదేశించారు. లాక్‌డౌన్ ఉన్నందున ఎవరూ ఇళ్లు విడిచి వెళ్లొద్దని సూచించారు. స్వస్థలాలకు వెళ్లేందుకు ఇప్పటి వరకు పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రాలేవీ చెల్లవని డీజీపీ స్పష్టం చేశారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు హాస్టళ్ల నిర్వాహకులతో మాట్లాడాలని మహేందర్‌రెడ్డి ఆదేశించారు. మరోవైపు స్వస్థలాలకు వెళ్లేందుకు ఇప్పటికే వందల సంఖ్యలో అనుమతి పత్రాలను నగర పోలీసులు జారీ చేశారు. వాటితో ఊళ్లకు బయల్దేరిన కొంతమంది హాస్టల్ విద్యార్థులు ఏపీ సరిహద్దుల్లో పడిగాపులు పడుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ట్వీట్ చేశారు. స్వంత రాష్ట్రాలకు వెళ్లవచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుకుంటున్నారని ట్వీట్ చేశారు. ఈ విషయంపై ఏపీ సర్కార్ స్పందించింది. హైదరాబాద్‌లో హాస్టళ్ల నుంచి విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారని, వారికి రవాణా ఇబ్బందులు తలెత్తుతాయని తెలంగాణా ప్రభుత్వ దృష్టికి ఏపి అధికారులు తీసుకెళ్లారు. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఒకచోట నుంచి మరొక చోటుకి కదలడం శ్రేయస్కరం కాదని ఏపి ప్రభుత్వం అంటోంది.
ఇదే అంశాలపై ఏపీ సీఎస్ నీలం సాహ్ని సైతం తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌తో మాట్లాడారు. తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా పోలీసు పాసులు ఇస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఏపీ సీఎస్ చెప్పారు. మరోవైపు ఏపీ సీఎంవో అధికారులు కూడా తెలంగాణ సీఎంవో అధికారులతో దీనిపై చర్చించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో హాస్టళ్ల నుంచి విద్యార్థులను ఖాళీ చేయించొద్దని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి అధికారులకు ఆదేశాలు జారీచేశారు.