లోకేష్ విసిరిన సవాల్ స్వీకరించే దమ్ము జగన్‌కు ఉందా? : మంత్రి అనిత

 

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ అమరావతిలో మీడియాతో హోంశాఖ మంత్రి మాట్లాడుతు రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఉన్నంత వరకూ  జగన్ ఆటలు సాగవని ఆమె హెచ్చరించారు. మహిళల రక్షణ విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంటే, దానిపై వైసీపీ కడుపు మంటతో విమర్శలు చేస్తోందని ఆరోపించారు. వైసీపీ మహిళా నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని హితవు పలికారు. శాంతిభద్రతలకు ఎలాగైనా విఘాతం కలిగించాలని చూసే జగన్ కుట్రలు రాష్ట్రంలో సాగనివ్వబోమని ఆమె కుండ బద్దలు కొట్టారు. రాష్ట్రంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. దీనికి ఎవ్వరు విఘాతం కలిగించాలని చూసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 

అమరావతిని "వేశ్యల రాజధాని" అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అలాంటి వ్యక్తిని వైసీపీ నేతలు, మాజీ మంత్రులు సమర్థించడం దారుణమని మంత్రి అనిత అన్నారు. "అదే అమరావతిలో జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి ఇల్లు కట్టుకోలేదా? మాజీ మంత్రులు, ఎంపీలు, వారి కుటుంబాలు నివసించడం లేదా?" అని ఆమె ప్రశ్నించారు. మహిళలను అగౌరవపరిచేలా మాట్లాడిన వ్యక్తికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇస్తే, దాన్ని సమర్థిస్తూ జగన్ ట్వీట్ చేయడం మహిళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలియజేస్తోందని విమర్శించారు. కొమ్మినేని శ్రీనివాస్‌కు ఇచ్చిన బెయిల్ షరతుల్లో టీవీ డిబేట్లలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టంగా ఉందని, దీన్నిబట్టి ఆయన వ్యాఖ్యలు తప్పని సుప్రీంకోర్టు కూడా నిర్ధారించిందని  హోం మంత్రి గుర్తుచేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu