హైటెక్ సిటీ టు రాయదుర్గం మెట్రో ప్రారంభించిన మంత్రి కేటీఆర్

 

మాదాపూర్ లోని హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు ఉన్న మెట్రో రూట్ లో రైళ్ళు ఈరోజు ప్రారంభమయ్యాయి. మంత్రులు కేటీఆర్, అజయ్ కుమార్ మెట్రో మార్గాన్ని ప్రారంభించారు. హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు మంత్రులు మెట్రో రైల్లో ప్రయాణించారు. మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి రాయదుర్గం స్టేషన్ లో మెట్రో సేవలు ప్రయాణికులకు అందుబాటు లోకి వచ్చాయి. 

మెట్రో రైలు నగర వాసులకు తొలిసారిగా అందుబాటు లోకి వచ్చి నేటికి 2 ఏళ్లు. ఇవాలే హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు కీలకమైన మరో కిలోమీటరున్నర దూరం అందుబాటులోకి వచ్చింది. మంగళ, బుధవారాల్లో తనిఖీలు నిర్వహించిన కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ గురువారం భద్రతా ధ్రువ పత్రం జారీ చేయడంతో ఈ మార్గాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయం రూ.14,132 కోట్లు ఇందులో 90 శాతం L&T, మిగిలిన 10 శాతం కేంద్రం వ్యయ నిధి కింద నిర్మాణ సంస్థకు చెల్లించింది. రహదారి వెడల్పు, భూసేకరణ, విద్యుత్ స్తంభాల వ్యయాలను రాష్ట్ర ప్రభుత్వం భరించింది. రవాణా ఆధారిత అభివృద్ధి కింద మాల్స్ నిర్మాణానికి L&T మెట్రో అదనంగా రూ.2000 కోట్లు వెచ్చిస్తుంది. అయితే ఇప్పటి వరకూ L&T మాల్స్ కోసం రూ.14,800 కోట్లు ఖర్చు చేసిందని మెట్రో వర్గాలు తెలిపాయి. ఇందులో రూ.3000 కోట్లు ఈక్విటీ మిగిలినది రుణాలుగా సేకరించింది. నిర్మాణ సంస్థకి కేంద్రం 1200 ల కోట్ల సర్దుబాటు వ్యయనిధి అందజేసింది. రాష్ట్రప్రభుత్వం రహదారి విస్తరణ, సుందరీకరణ పనుల కోసం ఇప్పటి వరకు రూ.2800 కోట్ల వరకు ఖర్చు చేసింది.