గాడ్సే ఫాలోవర్స్..గాంధీని మళ్ళీ చంపారు

 

శ్రీరామున్ని భారతీయులు ఎంతగా పూజిస్తారో..శ్రీలంకలో రావణాసురున్నీ అంతే పూజిస్తారు. అలాగే మనజాతిపిత గాంధీని మనం ఎంత గౌరవిస్తామో..ఆయన్ని కాల్చి చంపిన గాడ్సేని కూడా అభిమానించే వాళ్ళూ ఉన్నారు. నిన్న మహాత్ముడి 71వ వర్ధంతి. ఈ సందర్బంగా దేశప్రజలంతా ఆయనకు నివాళులర్పిస్తుంటే హంతకుడు గాడ్సే మాతృసంస్థ ‘హిందూ మహాసభ’ జాతిపిత హత్యా ఉదంతాన్ని పునఃసృష్టించింది. యూపీలోని అలీగఢ్‌లో, ఆ సంస్థ సభ్యులందరూ హర్షధ్వానాలు చేస్తుండగా హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి పూజా శకున్‌ పాండే.. గాంధీజీ గడ్డిబొమ్మపై తుపాకీతో కాల్పులు జరిపారు. అక్కడున్నవారంతా ‘మహాత్మా నాథూరాం గాడ్సే అమర్‌ రహే’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. గాంధీజీ గడ్డిబొమ్మను దహనం చేశారు. అనంతరం పూజా విలేకరులతో మాట్లాడారు. ‘‘గాంధీజీ హత్య ఘటనను పునఃసృష్టించడం ద్వారా మేమొక కొత్త సంప్రదాయానికి నాందిపలికాం. ఏటా దసరా రోజున రావణాసురుడి బొమ్మను దహనం చేసినట్టు.. ఇకముందూ ఇది కొనసాగుతుంది’’ అని చెప్పారు. గాంధీజీని హత్య చేసిన గాడ్సే హిందూ మహాసభ సభ్యుడే. గాడ్సే గౌరవార్థం ఆ సంస్థ ఏటా జనవరి 30ని ‘శౌర్యదివ్‌స’గా జరుపుతుంది. గాంధీజీ గడ్డిబొమ్మపై కాల్పులు జరిపి దహనం చేయటంపై ఎటువంటి నిరసనలు వెల్లువెత్తకపోవటం గమనార్హం.