అమెరికాలో నకిలీ కలకలం..200 మంది తెలుగువారి అరెస్ట్

 

అమెరికాలోని ఓ ఫేక్ యూనివర్శిటీలో తప్పుడు సర్టిఫికెట్ల ద్వారా అడ్మిషన్ పొందిన తెలుగు విద్యార్థులను యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేశారు. వీరికి సహకరిస్తున్న దళారీలను కూడా అరెస్ట్ చేశారు. అక్రమ వలసదారుల్ని గుర్తించడానికి హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులే ఏకంగా యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ అనే ఓ నకిలీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేశారు. 2015లో ఏర్పాటైన ఈ వర్శిటీలో 2017 నుంచి అధికారులు మారువేషాల్లో ఉద్యోగులుగా చేరారు. అక్రమ వలసదారులకు అడ్మిషన్‌ పేరిట గాలం వేశారు. ఉన్నత విద్య పేరిట నకిలీ పత్రాలతో అమెరికాలోకి ప్రవేశించి.. అక్రమంగా నివసిస్తున్న వారిని టార్గెట్‌ చేసుకొని వారు ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్‌లో విద్యార్థుల పేరిట నమోదైన అక్రమ వలసదారుల గుట్టు బట్టబయలైంది. ఎనిమిది మంది తెలుగువారు సుమారు 600 మంది విదేశీ విద్యార్థులకు నకిలీ పత్రాలు ఇప్పించారని తేల్చారు. దీంతో అధికారులు ఆ ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. డెట్రాయిట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టైన వారిలో భరత్‌ కాకిరెడ్డి (29) (ఫ్లోరిడా), అశ్వంత్‌ నూనె (26) (అట్లాంటా), సురేష్‌రెడ్డి కందాల (31) (వర్జినియా), ఫణిదీప్‌ కర్నాటి (35) (కెంటకీ), ప్రేమ్‌కుమార్‌ రామ్‌పీసా (26) (నార్త్‌ కరోలినా), సంతోష్‌రెడ్డి సామ, (28) (కాలిఫోర్నియా), అవినాష్‌ తక్కళ్లపల్లి (28) (పెన్సిల్వేనియా), నవీన్‌ పత్తిపాటి (29) (డల్లాస్‌) తదితరులు ఉన్నారు. అలాగే అక్రమంగా సర్టిఫికెట్లు పొందిన 600 మందిలో 200 మంది తెలుగువారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు అమెరికాలో హాట్‌టాఫిక్‌గా మారింది.