హిల్లరీకి షాక్.. ట్రంప్‌ పైచేయి

 

ఈనెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకూ హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ కంటే పై చేయిలో ఉండగా.. ఇప్పుడు ఆమె ఆధిక్యం కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. అమెరికాలో పలు సంస్థలు నిర్వహించిన సర్వేలో ఇప్పటివరకూ హిల్లరీ ఏడు శాతం మద్దతుదారులను కోల్పోయారు. ఇక ట్రంప్ ఒక శాతం ఆధిక్యం కనబరిచారు. దీనికి ప్రధాన కారణం ప్రైవేటు ఈ-మెయిల్‌ వివాదమే అని తెలుస్తోంది.  గత ఎన్నికల్లో ఇదే సమయానికి రెండు పార్టీల అభ్యర్థులకున్న మద్దతుదారులతో పోలిస్తే.. ప్రస్తుతం హిల్లరీ, ట్రంప్‌ ఇద్దరు వెనకబడినట్టే కనిపిస్తుందని వివరించింది. తాజా విజయంపై ట్రంప్‌ రెట్టించిన ఉత్సాహంతో స్పందించారు. ‘వావ్‌, ప్రస్తుతం నేను ఆధిక్యంలో ఉన్నా. రెండు వారాల్లో దాదాపు 12 పాయింట్లు పైకి వెళ్లాను. అది కూడా సంకుచిత హిల్లరీని వెనక్కు నెట్టి’అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇప్పటివరకూ ప్రముఖ సంస్థలు వెలువరించిన అంచనాల సగటు చూస్తే.. హిల్లరీ ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ట్రంప్‌పై ఆమె 3.1 శాతం పాయింట్లు ముందంజలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. మరి ఎన్నికలు జరిగే వేళ వచ్చేసరికి ఏం జరుగుతుందో చూడాలి.