హిల్లరీకి ఊరట.. ఎఫ్‌బీఐ క్లీన్ చీట్..

 

రేపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్ కు పెద్ద ఊరట లభించింది. ఈ మెయిల్స్ విషయంలో ఆమెకు క్లీన్ చిచ్ ఇచ్చింది ఎఫ్‌బీఐ. హిల్ల‌రీ విదేశాంగ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అధికారిక ఈమెయిల్స్ కోసం ప్రైవేట్ స‌ర్వర్ వినియోగించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జులైలో తాము వెలువ‌రించిన అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేద‌ని.. హిల్ల‌రీ క్రిమిన‌ల్ కేసును ఎదుర్కోవాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టంచేసింది. అయితే గతంలోనే హిల్లరీకి క్లీన్ చిట్ ఇచ్చిన ఎఫ్‌బీఐ.. అప్పుడే క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఆతరువాత హిల్ల‌రీ వ్య‌క్తిగ‌త స‌హాయ‌కురాలు హ్యూమా అబెదిన్ భ‌ర్త ఆంథోనీ వీన‌ర్‌పై విచార‌ణ‌లో భాగంగా ఈ కొత్త ఈమెయిల్స్ బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో కొత్త‌గా దొరికిన‌ ఈమెయిల్స్‌పై తాము పునఃస‌మీక్ష నిర్వ‌హిస్తున్న‌ట్లు ఎన్నిక‌ల‌కు స‌రిగ్గా 11 రోజుల ముందు ప్ర‌క‌టించి హిల్ల‌రీ క్యాంప్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టించింది ఎఫ్‌బీఐ. ఇప్పుడు దీనిపై విచారించిన ఎఫ్‌బీఐ మరోసారి హిల్లరీకి క్లీన్ చిట్ ఇచ్చారు.

 

ఈ సందర్భంగా ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ..పునఃసమీక్ష‌లో భాగంగా తాము ప‌రిశీలించిన వేలాది ఈమెయిల్స్‌లో చాలావ‌ర‌కు గ‌తంలో చూసిన‌వాటికి డూప్లికేట్‌వే అని, వీటిలో వ్య‌క్తిగ‌త మెయిల్స్ కూడా ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. అందుకే విచార‌ణ త్వ‌రిత‌గ‌తిన పూర్త‌యింద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. విదేశాంగ మంత్రిగా ఉంటూ సున్నితమైన వివ‌రాల‌పై హిల్ల‌రీ అజాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించారు త‌ప్ప‌.. అధికార దుర్వినియోగానికి మాత్రం పాల్ప‌డ‌లేద‌ని చెప్పారు. కాగా తాజాగా మ‌రోసారి క్లీన్‌చిట్ ద‌క్క‌డం ఎన్నిక‌ల్లో హిల్ల‌రీకి క‌లిసొచ్చేదే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.