విపక్ష నేత హోదాపై జగన్ పిటిషన్.. హైకోర్టులో నేడు విచారణ
posted on Sep 24, 2025 11:35AM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న విషయంలో మంకుపట్టు వీడటం లేదు. ప్రతిపక్ష హోదాకు అవసరమైన సంఖ్యా బలం లేకపోయినా ఆయన దాని కోసం పట్టుబడుతూ అసెంబ్లీని కూడా బాయ్ కాట్ చేశారు. అయినా ప్రభుత్వం దిగిరాలేదు. సభలో సంఖ్యాబలంలేనందున వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పీకర్ రూలింగ్ కూడా ఇచ్చారు. దీంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు.
తనను ప్రతిపక్షనేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇచ్చిన రూలింగ్‌ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు బుధవారం (సెప్టెంబర్ 24) విచారించనుంది. జగన్ పిటిషన్ లో తనను ప్రతిపక్షనేత హోదా కల్పించేలా ఏపీ శాసన వ్యవహారాల కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని కోరారు. శాసన సభ కార్యదర్శి, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌లను ప్రతివాదులుగా చేర్చారు.