లగచర్ల, హకీంపేట భూ సేకరణపై హైకోర్టు స్టే
posted on Mar 6, 2025 2:58PM
నిరుడు లగచర్ల, హకీం పేటలో భూసేకరణపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసింది. వికారాబాద్ జిల్లా లగచర్ల ఫార్మా కంపెనీ కోసం రైతుల నుంచి భూములను సేకరించాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. లగచర్ల భూములు ఇవ్వడానికి రైతులు వ్యతిరేకించారు. కలెక్టర్ మీద కూడా దాడి జరిగింది. దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఈ ఘటనలో అరెస్ట్ అయ్యారు. తెలంగాణలో సంచలనమైన భూసేకరణ నోటిఫికేషన్ రేవంత్ సర్కార్ రద్దు చేసుకుంది. ఫార్మా కంపెనీ కోసం కాకుండా ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రభుత్వం సంసిద్దమైంది. మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేసింది. లగచర్లలో భూ సేకరణను వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టునాశ్రయించారు. భూ సేకరణ నిలుపుదల చేయాలని కోర్టును అభ్యర్థించారు. హకీంపేటలో కూడా భూసేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. శివకుమార్ అనే వ్యక్తి హైకోర్టులో నాశ్రయించారు. భూసేకరణ నోటిఫికేషన్‌ను నిలుపుదల చేయాలని కోరారు. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కు కోసం 351 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడం లేదంటూ పిటిషనర్ ఆరోపించారు. హైకోర్టు గురువారం నాడు ప్రభుత్వం జారీ చేసిన భూ సేకరణ నోటీసులపై స్టే విధించింది. రైతుల నుంచి భూములను సేకరించకూడదని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.