ఓ ఇంటర్వ్యూతో కోర్టుకెళ్లనున్న స్పీకర్

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు హైకోర్టులో చుక్కెదురైంది.ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించి అధికంగా ఖర్చు చేశారన్న కేసులో కోడెల శివప్రసాద్‌కు ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈనెల 10న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.2014 ఎన్నికల్లో రూ.11 కోట్ల 50లక్షలు ఖర్చుపెట్టానని కోడెల ఓ ఇంటర్వ్యూలో చెప్పారని సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి గతంలో కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించిన పిటిషనర్ ఐటీ అధికారులతో విచారణ జరిపించాలని కోరారు. దీన్ని విచారణకు స్వీకరించిన కరీంనగర్ కోర్టు విచారణకు హాజరుకావాలని కోడెలను గతంలో ఆదేశించింది. అయితే కరీంనగర్ కోర్టు ఆదేశాలపై కోడెల శివప్రసాద్ హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల విచారణకు నాంపల్లిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు కావడంతో ఆ కేసు అక్కడికి బదిలీ అయింది. కోడెల స్టే పొంది ఆరు నెలలు పూర్తి కావడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టే పొడిగించాలని హైకోర్టును కోరారు. హైకోర్టులో పిటిషన్ ఇంకా విచారణకు రాకపోవటంతో ప్రత్యేక కోర్టు ఈ నెల 10న విచారణకు రావాలని కోడెలను ఆదేశించింది.