ఏపీలో స్ధానిక ఎన్నికలు మరింత ఆలస్యం? బడ్జెట్ సమావేశాలకు సన్నాహాలు

ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సమగ్ర సర్వే చేయకుండా బీసీ రిజర్వేషన్లు పెంచిన వ్యవహారంలో నిబంధనలు పాటించలేదంటూ మంగళవారం హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో తీర్పు వచ్చే నెల మొదటి వారానికి వాయిదా పడింది. అదే సమయంలో స్ధానిక ఎన్నికల నిర్వహణపై తీర్పును సైతం హైకోర్టు రిజర్వ్ లో ఉంచింది. దీంతో ఎన్నికల ప్రక్రియ ఇప్పట్లో ప్రారంభమయ్యేలా లేదు. వాస్తవానికి స్ధానిక ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం... హైకోర్టు తీర్పు వాయిదా నేపథ్యంలో అశెంబ్లీపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్ధితి.

ఏపీలో స్ధానిక సంస్ధల్లో రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గత డిసెంబర్ 28న ప్రభుత్వం జీవో జారీచేసింది. దీని ప్రకారం ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసింది. దీంతో రిజర్వేషన్ల శాతం 59.85కు చేరింది. అయితే రిజర్వేషన్లు ఎట్టి పరిస్దితుల్లోనూ 50 శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హైకోర్టు కూడా వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అదే సమయంలో బీసీ రిజర్వేషన్లను 2011 జనాభా గణన ఆధారంగా రూపొందించిన అంచనాలతో ఖరారు చేయడాని కూడా హైకోర్టు తప్పుబట్టింది. ఎప్పుడో 2011లో జరిగిన జనగణనను ఆధారంగా చేసుకుని అంచనాలతో బీసీ రిజర్వేషన్లు ఎలా ఖరారు చే్స్తారని కోర్టు ప్రశ్నించింది. సమగ్ర సర్వే జరపకుండా బీసీ రిజర్వేషన్ల పెంపు నిబంధనలకు విరుద్ధంగా ఉందని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే నెల మొదటివారానికి వాయిదా వేసింది.

స్ధానిక సంస్ధల ఎన్నికలపై హైకోర్టులో అభ్యంతరాలు తొలగిపోతే వచ్చే నెల మొదటి వారంలో ఈ ప్రక్రియ పూర్తి చేసి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వానికి తాజా పరిణామాలతో ఇబ్బందికర పరిస్ధితి ఎదురవుతోంది. హైకోర్టులో కేసుల విచారణ వాయిదా దృష్ట్యా చూస్తే మార్చి మెదటి వారంలో ఎన్నికల నిర్వహణ కష్టమని తేలిపోయింది. కాబట్టి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి మొదటి వారంలోనే నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్చి 2 లేదా 3వ తేదీల్లోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే వీలుంది. ఆ తర్వాత వారం లేదా పది రోజుల పాటు సమావేశాలు నిర్వహించి ఆ తర్వాత కోర్టు తీర్పు ఆధారంగా స్ధానిక ఎన్నికలకు వెళ్లాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనపడుతోంది. మరో రెండు రోజుల్లో ప్రభుత్వం దీనిపై పూర్తి స్ధాయిలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.