పులివెందుల సతీష్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారా?

కడప జిల్లాలో వైఎస్ కుటుంబం దశాబ్దాలుగా వరుస విజయాలు అందుకుంటున్నా వారికి కొరుకుడు పడని నేత ఎవరైనా ఉన్నారంటే సతీష్ రెడ్డి మాత్రమే. రాజశేఖర్ రెడ్డి బతికున్న సమయంలో ఆయనతోనూ, ఆ తర్వాత ఆయన తనయుడు జగన్ తోనూ ముఖాముఖీ తలపడిన సతీష్ రెడ్డి కొంతకాలంగా సొంత పార్టీ టీడీపీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమను దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన వైసీపీతో పెట్టుకోవడం ఎందుకని భావిస్తున్నారో లేక ఆ పార్టీతో రాజీపడ్డారో తెలియదు కానీ కొన్ని నెలలుగా సతీష్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. దీంతో త్వరలో టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారనే ప్రచారం మొదలైంది. ఇది ఆయన దృష్టికి వెళ్లినా ఖండించకపోవడం చూస్తుంటే టీడీపీ పులివెందులలో కొత్త ఇన్ ఛార్జ్ ను వెతుక్కోక తప్పదా అనిపిస్తోంది.

చాలా కాలం క్రితం కడప జిల్లాలో జరిగిన మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్య రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. పులివెందులలో వైఎస్ కుటుంబానికి ప్రత్యర్దులుగా ఉన్న కొందరు రాజారెడ్డిని కాపు కాసి నరికిచంపారు. అయితే ఈ హత్య కేసు న్యాయస్దానాల్లో సుదీర్ఘకాలం విచారణ జరిగింది. ఇందులో పులివెందులకు చెందిన సతీష్ రెడ్డి పాత్ర ఉందని వైఎస్ బలంగా నమ్మేవారు. అంతే కాదు తన తండ్రి హంతకులు పులివెందులలో తన కళ్లముందు తిరుగుతున్నా వదిలేశానని వైఎస్ చెప్పుకునేవారు. అయితే వైఎస్ తండ్రి హత్యలో తన పాత్ర లేదని సతీష్ రెడ్డి కూడా చెప్పుకునేవారు. అయినా వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పులివెందుల నియోజకవర్గంలో 1999 నుంచి 2019వరకూ అదే వైఎస్ కుటుంబీకులపై పోటీ చేస్తూనే ఉన్న సతీష్ రెడ్డి టీడీపీకి కీలక నేతగా మారిపోయారు. ఒకప్పుడు పులివెందులలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పోటీ చేసే అభ్యర్ధులకు బూత్ ఏజెంట్లు కూడా ఉండే వారు కాదు. అలాంటిది వైఎస్ కుటుంబంపై టీడీపీ నుంచి పోటీ చేయడమే కాకుండా బూత్ ఏజెంట్లను కూడా పెట్టుకునే పరిస్ధితికి తీసుకొచ్చారు సతీష్ రెడ్డి. అలాంటి నేత తాజాగా మౌనం వహించడం వెనుక పెద్ద వ్యూహమే ఉండొచ్చని చెబుతున్నారు.

గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమలోని 52 స్ధానాల్లో 49 సీట్లు గెల్చుకుని వైసీపీ జోరు మీదుంది. ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఎంత చెబితే అంతగా రాయలసీమలో పరిస్ధితులు ఉన్నాయి. గతంలో జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి మీద చేసిన పోరాటం వేరు, ఇప్పుడు జగన్ మీద పోరాటం చేయడం వేరు. జగన్ ది తన తాత రాజారెడ్డి మనస్తత్వమని స్వయానా తన పార్టీ అధినేత చంద్రబాబే నేరుగా ఆరోపిస్తున్న తరుణంలో జగన్ కు ఎదురు వెళ్లడం మంచిదా కాదా అనే విషయంలో సతీష్ రెడ్డి ఓ క్లారిటీకి వచ్చేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు. తాజాగా కడప జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా నిర్వహించిన సమావేశానికి మాత్రమే ఆయన హాజరయ్యారు. పార్టీ సమన్వయ కమిటీల భేటీలకు సైతం సతీష్ రెడ్డి దూరంగాన ఉంటున్నారు. దీంతో ఆయన పార్టీ మారిపోవడం లేదా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవచ్చని చెబుతున్నారు. సతీష్ రెడ్డి యాక్టివ్ కాకపోతే ఆయన స్ధానంలో ఎమ్మెల్సీ బీటెక్ రవిని చంద్రబాబు పులివెందుల ఇన్ ఛార్జ్ గా నియమించే అవకాశముంది.