అమరావతి పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు.. వచ్చేనెల 30కి విచారణ వాయిదా

ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ఏఫీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఇందులో మూడు రాజధానులకు ఉద్ధేశించిన సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లు, వికేంద్రీకరణ బిల్లుతో పాటు కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాల తరలింపు పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం ఇవాళ విచారించింది. ఈ సందర్భంగా కర్నూలుకు హైకోర్టు తరలింపుపైనా ధర్మాసనం ముందు పిటిషనర్లు వాదనలు వినిపించారు. కర్నూలుకు హైకోర్టు తరలింపు ప్రక్రియ ఇంకా మొదలు కానందున అమరావతిలో హైకోర్టులో జరుగుతున్న పనులు కొనసాగించాలని ధర్మాసనం సూచించింది.

మూడు రాజధానుల ఏర్పాటు సందర్బంగా దాఖలైన పిటిషన్లను వేర్వేరుగా విచారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అదే సమయంలో మూడు రాజధానుల ప్రక్రియకు ప్రాతిపదికగా ప్రభుత్వం చెబుతున్న జీఎన్‌ రావు, బోస్టన్‌ గ్రూపు నివేదికలను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. వివిధ పిటిషన్లపై వాదనలు విన్న ధర్మాసనం వీటిపై తదుపరి వాదనలను వచ్చే నెల 30కి వాయిదా వేసింది.