ఏపీలో మొదలవుతున్న పరీక్షల సీజన్.. అధికారుల విస్తృత ఏర్పాట్లు

ఏపీలో పబ్లిక్ పరీక్షల సీజన్ మొదలు కాబోతోంది. వచ్చే నెల 4 నుంచి ఇంటర్, 23 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల షెడ్యూల్, ఏర్పాట్ల వివరాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇవాళ సచివాలయంలో వెల్లడించారు. వీటి ప్రకారం ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుంచి 23 తేదీ వరకు 20 రోజుల పాటు జరగనున్నాయి. ఇందుకోసం 1411 పరీక్ష కేంద్రాను సిద్దం చేస్తున్నారు. ఈ ఏడాది 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ మీడియట్ పరీక్షలు రాయనున్నారు.

అలాగే పదో తరగతి పరీక్షలు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 తేదీ వరకు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 6 లక్షల 30 వేల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 2,900 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. పరీక్ష సమయంలో స్థానికంగా ఉండే జిరాక్స్ కేంద్రాలు కూడా మూసివేసేలా చర్యలు.తీసుకోనున్నారు.. ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ విధానంలో కేటాయించనున్నారు. 1400 ఇంటర్ పరీక్ష, 2900 పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో ఎక్కడా విద్యార్థులు కింద కూర్చుని పరీక్ష రాసే అవస్థలు లేకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు విద్యాశాఖ మంత్రి సురేష్ తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో స్వల్ప మార్పులు చేసినందున విద్యార్థులను సిద్ధం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

టెన్త్ , ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రతి హాల్ టికెట్ పైనా క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. ప్రతి విద్యార్థి హాల్ టికెట్ ను తనిఖీ చేయనున్నారు. పరీక్ష కేంద్రాలు తెలుసుకునేందుకు ఓ యాప్ ను కూడా సిద్ధం చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో కాపీయింగ్ నిరోధానికి సీసీ కెమెరాలను అందుబాటులో ఉంచుతున్నారు. పరీక్ష పత్రాలు లీకేజీ లేకుండా ఉండేందుకు చీఫ్ సూపర్ వైజర్ మినహా ఎవరి వద్దా మొబైల్ ఫోన్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు విద్యామంత్రి తెలిపారు. గతంలోలా పొరుగు రాష్ట్రాల్లో మన విద్యార్ధులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఇంటర్ లో గ్రేడింగ్ తో పాటు మార్కులు కూడా ఇవ్వనున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను కూడా ఇన్విజిలేటర్లుగా వాడుకోనున్నారు.

పరీక్షల నిర్వహణకు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలకు మార్చి 3 తేది నుంచి, పదో తరగతి పరీక్షలకు 14 తేదీ నుంచి కంట్రోల్ రూమ్ పని చేస్తుంది. ఇన్విజిలేటర్లుగా గా అవకాశం ఉంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను కూడా వినియోగించుకుంటామని విద్యామంత్రి సురేష్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు, గందరగోళం లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని సురేష్ పేర్కొన్నారు. జవాబు పత్రం కేవలం 24 పేజీలతో ఉంటుందని, ఈసారి అడిషనల్ తీసుకునే అవకాశం లేదని ఆయన తెలిపారు. నూజివీడు ఐఐఐటీలో బాలికల హాస్టల్లో విద్యార్ధి చొరబడిన ఘటనపై విచారణ కమిటీ వేశామని .దీనిపై నివేదిక వచ్చాక చర్యలు చేపడతామని సురేష్ వెల్లడించారు.