తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు
posted on Nov 28, 2023 11:09AM
తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలో ఉన్న మలక్కా జలసంధి ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని... ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని వెల్లడించింది. బుధవారం నుంచి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 48 గంటల్లో వాయవ్య దిశగా కదులుతూ తుపానుగా బలపడుతుందని తెలిపింది. తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరింది. తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈరోజు గాలి 25 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని పేర్కొంది. డిసెంబర్ 1న గాలి వేగం 60 నుంచి 80 కిలోమీటర్లుగా ఉంటుందని వెల్లడించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గతకొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతపవనాలు, తూర్పుగాలుల ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నాయి. తాజాగా.. రాష్ట్రంలో వర్షాలపై వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జనగాం, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని చెప్పింది.