ఎక్కువగా ఆవలింపులు వచ్చే వారికి ఉండే అసలు సమస్యలు ఇవీ..!
posted on Jul 1, 2025 9:30AM

ఆవలింత అనేది మనమందరం అనుభవించే ఒక సాధారణ శారీరక ప్రక్రియ. తరచుగానిద్రపోవడం లేదా అధిక అలసటగా ఉన్నప్పుడు ఆవలింపులు వస్తుంటాయి. కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఆవలింపులు తగ్గిపోతాయని అనుకుంటాం. కానీ తరచుగా ఆవలింతలు వస్తుంటే మాత్రం అది నిద్రకు సంబంధించిన సమస్య కానే కాదు అంటున్నారు వైద్యులు. కొన్నిసార్లు ఇది శరీరంలోని ఆరోగ్య సమస్యలను కూడా సూచిస్తుందట. ఎవరైనా సాధారణం కంటే ఎక్కువగా ఆవలిస్తున్నారని అనిపిస్తే, తగినంత నిద్ర పోయిన తర్వాత కూడా పదే పదే ఆవలిస్తున్నారని భావిస్తే దానిని లైట్ గా తీసుకోకూడదు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుంటే..
మెదడుకు ఆక్సిజన్ లేకపోవడం..
ఆవలింతకు ప్రధాన కారణం మెదడుకు తగినంత ఆక్సిజన్ చేరకపోవడం. శరీరంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు లేదా కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరిగినప్పుడు, మెదడు ఆవలింత ద్వారా ఉష్ణోగ్రతను, ఆక్సిజన్ మొత్తాన్ని నియంత్రిస్తుందట. ఈ పరిస్థితి వేడి, తేమతో కూడిన వాతావరణంలో లేదా ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం ద్వారా జరుగుతుందట. లోతైన శ్వాస తీసుకోవడం, స్వచ్ఛమైన గాలిలో నడవడం, వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉండటం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.
శారీరక, మానసిక ఒత్తిడి..
ఒత్తిడి, ఆందోళన కూడా తరచుగా ఆవలించడానికి కారణమవుతాయి. మనం ఒత్తిడికి గురైనప్పుడు, మన శ్వాస ప్రక్రియ సక్రమంగా ఉండదు. ఇది మెదడుకు ఆక్సిజన్ సరఫరాను ప్రభావితం చేస్తుంది. దీనితో పాటు, ఒత్తిడి కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం మరియు లోతైన శ్వాస వ్యాయామం వంటి పద్దతుల సహాయం తీసుకోవచ్చు
మందుల దుష్ప్రభావాలు..
యాంటీ-డిప్రెసెంట్స్, యాంటిహిస్టామైన్లు లేదా నొప్పి నివారణ మందులు వంటి కొన్ని మందులు తరచుగా ఆవలింతకు కారణమవుతాయి. ఈ మందులు మెదడు రసాయనాలను ప్రభావితం చేస్తాయి. ఇవి నిద్ర లేదా మగత అనుభూతికి దారితీస్తాయి. మందులు ఆవలింతను పెంచుతున్నాయని అనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది. వైద్యులు మందుల మోతాదును సర్దుబాటు చేయవచ్చు లేదా ప్రత్యామ్నాయ చికిత్సలను సూచించవచ్చు.
ఆరోగ్య సమస్యలు..
తరచుగా ఆవలింతలు పడటం వల్ల స్లీప్ అప్నియా, నార్కోలెప్సీ లేదా థైరాయిడ్ సమస్యలు వంటి కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. స్లీప్ అప్నియా అధిక నిద్రకు కారణమవుతుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని కారణంగా నిద్ర పూర్తిగా ఉండదు. మరుసటి రోజు చాలా అలసిపోయినట్లు అనిపించవచ్చు. దీని కారణంగా ఆవలింత పగటిపూట పదేపదే రావచ్చు.
నార్కోలెప్సీ కూడా నిద్రకు సంబంధించిన సమస్య. ఇందులో, ఒక వ్యక్తి ఎప్పుడైనా, ఎక్కడైనా అకస్మాత్తుగా నిద్రపోవచ్చు. ఈ వ్యాధిలో రోగి పగటిపూట చాలాసార్లు నిద్రపోతాడు. దీని కారణంగా ఎక్కువగా ఆవలిస్తూ ఉంటారు. అలసట, తలనొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఆవలింతతో పాటు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...