రాజీనామాపై హరీష్ యూటర్నేనా?

రాజకీయాలలో సవాళ్లు, ప్రతి సవాళ్లు అన్నవి ప్రహసనంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు రాజీనామా అంటూ సవాల్ చేసి ఆ తరువాత మాట మార్చడం పొలిటికల్ లీడర్లకు రివాజుగా మారిపోయింది. ఆగస్టు 15 లోగా రుణమాఫీని అమలు చేస్తే రాజీనామా చేస్తానంటూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు గతంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సవాల్ ను స్వీకరించిన రేవంత్ ప్రభుత్వం రుణమాఫీని ఆగస్టు మొదటి వారంలోనే పూర్తి చేయడానికి సర్వం సిద్ధం చేసింది. తొలి విడతగా జులై 18నే లక్ష రూపాయల వరకూ రుణమాఫీని పూర్తి చేసింది. ఈ నెలాఖరుకు లక్షన్నర వరకూ, ఆగస్టులో రెండు లక్షల వరకూ రుణమాఫీ చేయడానికి షెడ్యూల్ కూడా విడుదల చేసింది. దీంతో హరీష్ రావు తన రాజీనామా విషయంలో మాట మార్చారు. రాజీనామా చేస్తానంటూనే ప్రభుత్వానికి కొన్ని షరతులు విధిస్తున్నారు అవేమంటే.. రుణమాఫీ ఆగస్టు 15లోగా పూర్తిచేసి, ఆరు గ్యారెంటీలనూ అమలు చేయాలంటున్నారు. అప్పుడే  ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేస్తానని నాలుక మడతేశారు.   అయితే  గతంలో హరీష్ రావు  కాంగ్రెస్ ప్రభుత్వం 48వేల కోట్ల రుణమాఫీ అమలు చేయలేదని భావించి, ఆగస్టు 15లోగా రుణమాఫీ  చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.  తమకు రాజీనామాలు కొత్తకాదని, ప్రజలకు మేలు జరుగుతుందంటే పదవులు వదులుకోవడానికి సిద్ధమని కూడా చెప్పారు. 

తొలుత రుణమాఫీ కింద 48వేలకోట్లు అవసరమవుతాయని   అంచనా వేశారు. కాని ప్రభుత్వం లక్ష రూపాయలు జీతం వస్తున్న వారు, ఉన్నతోద్యోగులు,  ఎమ్మెల్యే లు, మంత్రులు తదితరులను రుణమాఫీ పరిధి నుంచి తప్పించింది. ఆ  ప్రకారం రుణమాఫీకి అర్హులైన వారు 70లక్షలమందిగా తేలారు.  వారిలో  కార్డ్ లేనివారు ఉన్నారు. రుణమాఫీకి  పీఎం కిసాన్ సన్మాన్ పథకం మార్గదర్శకాలు పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో రుణమాఫీ లబ్దిదారుల సంఖ్య తగ్గింది.  దీంతో రుణమాఫీకి డబ్బు 48 వేల కోట్లు కాకుండా నుంచి 31వేల కోట్లు అవసరమౌతాయి.  ఆ మేరకు రేవంత్ సర్కార్  ఆర్ధిక సంస్థలను సంప్రదించి రుణాలకు లైన్ క్లియర్ చేసుకుంది. రేవంత్ సర్కార్ రుణమాఫీ  వాగ్దానాన్ని నిర్దిష్టగడువు కంటే ముందుగానే అమలు చేయడానికి రెడీ అయిపోయారు. 

దీంతో హరీష్ రావు రాజీనామా సవాల్ తెరపైకి వచ్చింది. రుణ మాఫీని ప్రభుత్వం అమలు చేస్తే రాజీనామా చేయాల్సి వస్తుందన్న భావనతో దానిలో లోపాలు వెతకడానికి మాజీ మంత్రి హరీష్ రావు భూతద్దం కోసం వెతుకుతున్నారు.  షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని ఆయన చేస్తున్న డిమాండ్ లో అర్ధం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావుకు ఏ ప్రభుత్వ పథకమూ కూడా షరతులు లేకుండా అమలు చేయడం సాధ్యం కాదని తెలియనిది కాదు.   రేవంత్ ఆగస్టు మొదటివారంలోనే రుణమాఫీని  పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీంతో హరీష్ రావు రాజీనామాపై యూటర్న్ తీసుకున్నారు. గతంలో రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన హరీష్ రావు ఇప్పుడు మాట మార్చి రుణమాఫీతో పాటు  ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేస్తేనే  రాజీనామా చేస్తానని మెలిక  పెడుతున్నారు. మొత్తం మీద రేవంత్ సర్కార్ రుణమాఫీ అమలు విషయంలో ప్రజా మన్ననలు పొందుతుంటే.. రాజీనామా సవాల్ పై వెనకడుగు వేసి రేవంత్ రెడ్డి ప్రజలలో పలుచన అయ్యారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu