హరికృష్ణ.. కిం కర్తవ్యమ్?

 

తెదేపా అభ్యర్ధుల 5వ జాబితా కూడా వెలువడింది. కానీ, అందులో కూడా నందమూరి హరికృష్ణ పేరు కనబడలేదు. ఇక నేడో రేపో తెదేపా బీజేపీలు తెగతెంపులు చేసుకొన్నట్లయితే, ఆ స్థానాలలో పోటీ చేసేందుకు కూడా ఇప్పటికే పార్టీ అభ్యర్ధుల పేర్లు ఖరారు అయ్యున్నాయి. కనుక ఈసారి శాసనసభకు పోటీ చేయాలని ఉవ్విళ్ళూరిన హరికృష్ణకు ఇక ఎంతమాత్రం ఆ అవకాశం లేనట్లే భావించవచ్చును. ఇది స్వయం కృతాపరాధమేనని చెప్పక తప్పదు.

 

తను పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి యన్టీఆర్ కొడుకుననే అహంభావంతో వ్యవహరిస్తూ ఆయన ఎప్పుడూ కూడా పార్టీలో తనకొక ప్రత్యేక స్థానం, హోదా కావాలని కోరుకోన్నారే తప్ప, అది పొందేందుకు ఏనాడు కృషి చేసిందీ లేదు, అందుకు అనుగుణంగా ఏనాడు వ్యవహరించనూ లేదు. తత్ఫలితంగానే నేడు టికెట్ కోసం చంద్రబాబు చుట్టూ ప్రదక్షిణాలు చేయవలసి వస్తోంది. కానీ, ఆయన ఒకవేళ స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగినట్లయితే అది కూడా మరో పెద్ద తప్పు అవుతుంది.

 

తనంతట తానుగా నందమూరి రాజకీయ వారసత్వాన్ని అందుకోలేని ఆయన, స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగినట్లయితే, నందమూరి వంశానికి చెందినవారు గనుకనే అటు పార్టీకి, తనకి, నందమూరి కుటుంబీకులకు సమస్యలు సృష్టించిన వారవుతారు. ఇప్పటికే పార్టీతో ఆయనకున్న విభేదాల కారణంగా కొడుకు జూ.యన్టీఆర్ సినీ జీవితంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకవేళ ఆయన తెదేపా అభ్యర్ధిపై స్వతంత్ర అభ్యర్ధిగా పోటీకి దిగి గెలిచినా, ఓడినా ఆ ప్రభావం జూ. యన్టీఆర్ తో సహా అందరి మీద పడటం ఖాయం. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేయకపోవడమే మేలేమో!