జ‌గ‌న్‌కు 'గుప్తా' గుబులు.. వైసీపీ నేత‌ల బెదురు.. మ‌రో ర‌ఘురామ?

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని ఎన్ని మప్పు తిప్పలు పెట్టాలో.. ఎలా రాజకీయంగా దెబ్బ కొట్టాలో అధికార వైయస్ జగన్ పార్టీకి తెలుసు.. అదే అధికార జగన్ పార్టీని ఎన్ని ముప్ప తిప్పలు పెట్టాలో.. రాజకీయంగా ఎలా దెబ్బ కొట్టాలో అదే పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ కె. రఘురామకృష్ణంరాజుకు తెలుసు.. ఆయన ఢిల్లీలో కూర్చుని ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ పార్టీలోని కీలక నేతలకు ఓ రేంజ్‌లో తలంటుతున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. చివరకీ ఈ విషయం జగన్‌ను అధికారంలోకి తీసుకు వచ్చిన ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌కు కూడా తెలుసన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇటు టీడీపీతో.. అటు రఘురామకృష్ణంరాజుతో రోజు వాతలు పెట్టించుకుంటుందన్నదీ పక్కా నిజం. కానీ జగన్ పార్టీని ఏకుతున్న వారి జాబితాలోకి ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సొమిశెట్టి సుబ్బారావు గుప్తా తాజాగా వచ్చి చేరారు. 

ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల గతేడాది డిసెంబర్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా జగన్ ప్రభుత్వ హయాంలోని చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల భవిష్యత్తులో ఫ్యాన్ పార్టీ కేడర్‌కు ఏర్పడే సమస్యలను సుబ్బారావు గుప్తా ఎత్తి చూపడం నాటి నుంచి..  సుబ్బారావు గుప్తాను మంత్రి బాలీనేని వాసన్న రైట్ హ్యాండ్ సుభానీ చావా బాదడం వరకు ఉన్న వీడియోలను ప్రపంచమంతా వీక్షించింది. 

సుబ్బారావు గుప్తాకు జరిగిందీ అన్యాయమని.. అర్యవైశ్య సంఘాలే కాదు.. జగన్ పార్టీలోని కేడర్ అంతా ముక్త కంఠంతో ఖండించింది. కానీ సుబ్బారావు గుప్తాకు మాత్రం న్యాయం జరగలేదు. అయితే తనకు జరిగిన అన్యాయంతోపాటు... జగన్ పార్టీకీ జరుగుతున్న చెడును సైతం.. వరుస ప్రెస్ మీట్లు పెట్టీ మరి మీడియా సాక్షిగా ఎండగడుతున్నాడీ సుబ్బారావు గుప్తా. 

తాజాగా సంక్రాంతి సందర్భంగా గుడివాడలో క్యాసినో వ్యవహారం.. గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని బూతుల పంచాంగం... కొడాలి నాని తీరుతో పార్టీలో ఓట్లు పోయే పరిస్థితి నెలకొందని.. కొడాలి నానికి పౌరసరఫరాల శాఖ తీసి.. హోం శాఖ ఇవ్వమంటూ స్వయంగా సీఎం జగన్‌కు సూచించడం.. అలాగే ఒంగోలు ఎమ్మెల్యే, జగన్ సమీప బంధువు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వద్ద...  అండర్ గ్రౌండ్‌లో ఏ పనులు ఏ విధంగా చేయాలి అనే విషయాలు చాలా చక్కగా నేర్చుకోవాలంటూ మంత్రి కొడాలి నానికి గుప్తా ఈ మీడియా సాక్షిగా సూచించడం.. అంతేకాదు బాలినేని శ్రీనివాసరెడ్డి.. విశ్వనటుడు కమలహాసన్‌లా చాలా చక్కగా యాక్షన్ చేస్తాడంటూ ఇదే ప్రెస్ మీట్‌ సాక్షిగా సుబ్బారావు గుప్తా చెప్పడం.. అక్కడితో ఆగకుండా..  వచ్చే 2024 ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ నుంచి పోటీకి దిగుతున్నట్లు సుబ్బారావు గుప్తా మరీ బల్లగుద్దీ చెప్పడంతో.. జగన్ పార్టీలో రచ్చ మొదలైందీ. ప్రతి పక్ష టీడీపీతో మనకు తిట్లు దండకం సరే సరి.. ఇక ఢిల్లీలో రఘురాముడు సెలవు రోజుల మినహా ప్రతి రోజూ తిట్ల బాణాలు విసరించుకోవడం పరిపాటిగా మారింది. 

కానీ ఈ రాష్ట్రంలోనే ఉంటూ.. అధికార పార్టీలోని లీడర్ నుంచి క్యాడర్ వరకు ఎవరినీ వదలకుండా ఓ రేంజ్‌లో దొబ్బేస్తున్న ఈ సుబ్బారావు గుప్తా తీరు మాత్రం తమకు మింగుడు పడడం లేదని.. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలోని కీలక నేతలు.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వద్ద మొర పెట్టుకున్నారని సమాచారం. ఈ అంశంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో తాను మాట్లాడతానని సదరు నేతలకు సీఎం జగన్ అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినా అధికార పార్టీలోకి కీలక నేతలకే తలపోటు, రక్త పోటు తెప్పిస్తున్న ఈ సుబ్బారావు గుప్తా మాత్రం మామూలోడు కాదోయి అనే టాక్ అయితే తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో వైరల్ కావడం విశేషం. ఏమైనా సుబ్బారావు గుప్తానా మజాకా.