ప్లీనరీ ముంగిట వైసీపీలో గ్రూపుల రచ్చ

ఎప్పుడో 2017లో వైసీపీ  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగిన ప్లీనరీ... మళ్లీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తరువాత జరగ బోతోంది.  ప్లీనరీ బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని ఇప్పటికే సీఎం జగన్  పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు  ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఆ పార్టీలోని కీలక నేతలు ప్లీనరీ సన్నాహాలు ప్రారంభించేశారు. స్థల పరిశీలన చేశారు. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. హడావుడి అయితే పడుతున్నారు కానీ  ప్లీనరీకి ఇంకా పట్టుమని పది రోజులు కూడా లేదు. అలాంటి సమయంలో వివిధ జిల్లాల్లో నేతల మధ్య గ్రూప్ తగాదాలు .. రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్నాయి.

తాజాగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి వ్యవహారం రచ్చకెక్కింది. హఠాత్తుగా ఇరువురు నేతలూ   ఎందుకు బరస్ట్ అయ్యారన్న చర్చ పార్టీలో ఓ రేంజ్ లో జరుగుతోంది. గతంలో కూడా జిల్లాల్లో నేతల మధ్య గ్రూప్ తగదాలు ఉన్నా అవి ఇలా రచ్చకెక్కిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు  మాత్రం అవి వీధి తగాదాలుగా మారిపోయాయి. మీడియా ముందు, టీవీ డిబెట్లలో కూడా కోటం రెడ్డి, బాలినేని రచ్చ ఓ రేంజ్ లో సాగుతోంది. విజయసాయిరెడ్డే బాలినేని, కోటంరెడ్డిల మధ్య చిచ్చుకు సూత్రధారి అన్న చర్చ వైసీపీ కేడర్ లో జోరుగా సాగుతోంది. వారిద్దరి మధ్యే కాదు.. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వైసీపీలో గ్రూపుల తగాదాలు పరిధిమీరి రచ్చకెక్కుతున్న పరిస్థితి ఉంది.  తాడేపల్లి ఫ్యాలెస్‌లోకి  విజయసాయి రీ ఎంట్రీ  తర్వాతే  జిల్లాల్లోని నేతల మధ్య ఉన్న గ్రూప్ తగాదాల   రచ్చ పెచ్చరిల్లిందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.   

వైయస్ జగన్ ప్రతిపక్ష నేత నుంచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కే వరకు విజయసాయిరెడ్డి  పాత్ర పార్టీలో అత్యంత కీలకం.. నాడు ఆయన ఆధ్వర్యంలోనే 2019 ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక లగాయతు.. జగన్ తొలి కేబినెట్ కూర్పు  జరిగింది.  ఆ తర్వాత ఆయన ఉత్తరాంధ్ర ఇన్ చార్జ్‌గా వైజాగ్ వెళ్లిపోయారు.. ఆ తర్వాల అంతా  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాలోని పదవులు రాని కీలక నేతలంతా ఆయన చుట్టూ  చేరారు. అక్కడ నుంచి ఏ జిల్లాలో జిల్లాల్లో ఎక్కడ ఏ నాయకుల మద్య అసంతృప్తి జ్వాలలు  ఎగిసినా   సజ్జల రామకృష్ణరెడ్డి  డైరెక్ట్‌గా రంగంలోకి దిగి.. సముదాయించడం జరుగుతూ వస్తోంది. 

అయితే విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించి.. జిల్లా అధ్యక్షులు, సమన్వయ కర్తల బాధ్యతలు అప్పగించడం రచ్చకు కారణమైందని అంటున్నారు. సజ్జల, విజయసాయి రెండు అధికార కేంద్రాలుగా మారడంతో జిల్లాల్లో పార్టీ నేతలు, క్యాడర్ రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.. సజ్జల, విజయసాయి మధ్య విడిపోయిన జిల్లాల నేతల పంచాయితీ ఇప్పుడు వారు కూడా తీర్చలేని స్థితికి చేరుకుందనీ, దీంతో ఇవన్నీ   జగన్ వద్దకు చేరుతున్నాయనీ పార్టీ కేడర్ చెబుతున్నారు.  అదే సమయంలో జనంలో వైసీపీ పాలన పట్ల వ్యతిరేకత పెరుగుతుంటే.. 

మరోవైపు తెలుగుదేశం, జనసేనలు బలోపేతం అవుతున్నాయి. ఆ రెండు పార్టీలు బలోపేతం అవుతున్నాయనడానికి జనసేన సభ, తెలుగుదేశం మహానాడుల సక్సెసే తార్కాణమని వైసీపీ క్యాడరే బహిరంగంగా చెబుతోంది. కేవలం ఒక ఎమ్మెల్యే ఉన్న జనసేన సభ సక్సెస్ అయ్యింది.. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం మహానాడు సూపర్ సక్సెస్ అయ్యింది. మరి   151 ఎమ్మెల్యేలు ఉండి, అధికారంలో ఉన్న వైసీపీ ప్లీనరీ ఎంత బ్రహ్మాండంగా జరగాలి అని జగన్ అంటుంటే... క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి లేదని వైసీపీ క్యాడర్ అంటున్నారు.