గ్రేటర్ హైదరాబాద్ వార్డులు 175 కాదు 200?
posted on Mar 25, 2015 7:54AM
.jpg)
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ బోర్డు పదవీకాలం గత ఏడాది డిశంబర్ 3వ తేదీన ముగిసింది. కానీ ఇంతవరకు దానికి ఎన్నికలు నిర్వహించలేదు. పెరిగిన జనాభాకి అనుగుణంగా ప్రస్తుతం కార్పోరేషన్ పరిధిలో ఉన్న 150 వార్డులను పునర్విభజనచేసి వాటిని 175కి పెంచాలని భావిస్తునందున ఎన్నికలు నిర్వహించడంలో ఆలశ్యం జరుగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించుకొని ఇంతకాలం ఎన్నికలను వాయిదా వేసుకొంటూ వచ్చింది. కానీ హైకోర్టు ధర్మాసనం ఒక పిటిషన్ పై స్పందిస్తూ తెలంగాణా ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించింది. రెండు వారాలలో తనకు ఎన్నికల షెడ్యూల్ సమర్పించకపోయినట్లయితే తనే స్వయంగా ఆపని చేయవలసి వస్తుందని హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా అందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కానీ ఇంతకు ముందు అనుకొన్నట్లుగా కార్పోరేషన్ పరిధిలో ఉన్న 150 వార్డులను 175కి బదులు ఏకంగా 200కి పెంచబోతున్నట్లు తాజా సమాచారం. ఆవిధంగా చేయడం వలన ఒక్కో వార్డులో సుమారు 30,000 మంది ఓటర్లు ఉంటారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలలో ప్రస్తుతం సుమారు 70 నుండి 80 వేల జనాభా ఉంది. కనుక అక్కడ కొత్తగా రెండు వార్డులు ఏర్పడే అవకాశం ఉంటుంది. వీలయినంత త్వరలో ఈ వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తిచేసి ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసేందుకు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.