విజయవాడలో కేసీఆర్‌కు ఘన స్వాగతం.. జగన్ తో భేటీ

 

తెలంగాణ సీఎం కేసీఆర్‌ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో కేసీఆర్‌కి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఘన స్వాగతం పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్‌ ని ఆహ్వానించడంతోపాటు విశాఖ శ్రీశారదాపీఠ ఉత్తరాధికారి శిష్య తురియాశ్రమ స్వీకార మహోత్సవంలో కేసీఆర్‌ పాల్గొంటారు.

కేసీఆర్ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా రోడ్డు మార్గాన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి బయలుదేరారు. అనంతరం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి వెళతారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావలసిందిగా జగన్‌ను కేసీఆర్ ఆహ్వానించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అక్కడ నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి గేట్‌ వే హోటల్‌కు వెళతారు. తర్వాత 5 గంటలకు విజయవాడలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ కార్యక్రమానికి హాజరవుతారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.