CPS కాదు GPS.. చంద్ర‌బాబు ప్ర‌తిపాద‌న‌లు కాపీ కొట్టిన జ‌గ‌న్‌!

విజ‌న్ ఉన్న నాయ‌కుడంటే చంద్ర‌బాబే. ఉన్న‌ది ఉన్న‌ట్టు ఒప్పేసుకుంటారు. జ‌గ‌న్‌లా మాట త‌ప్పుడు, మ‌డ‌మ తిప్పుడు ఆయ‌న నైజం కాదు. కానీ, జ‌గ‌న్ అలా కాదు. ఎలాగైనా గెలిచి తీరాల‌ని ఉద్యోగుల‌కు క‌ల్ల‌బొల్లి మాట‌లు చెప్పి.. వారం రోజుల్లో సీపీఎస్ ర‌ద్దు చేస్తాన‌ని హామీ ఇచ్చి.. అంద‌లం ఎక్కాక అడ్డంగా ద‌గా చేసేశారు. ఉద్యోగులు ఇప్పుడు రోడ్డెక్కుతుంటే.. పోలీసుల‌తో ఆ పోరాటాన్ని తొక్కేస్తున్నారు. సీపీఎస్ హామీని అట‌కెక్కించేసి.. ఉద్యోగుల నెత్తిన శ‌ఠ‌గోపం పెట్టేసి.. ఇప్పుడు జీపీఎస్ ప్ర‌తిపాద‌న తెర‌మీద‌కు తీసుకొచ్చారు. గ‌తంలో చంద్ర‌బాబు చూపిన ఆప్ష‌న్‌నే.. ఇప్పుడు జ‌గ‌న్ మ‌ళ్లీ ఉద్యోగుల ముందుకు తెచ్చారు. మ‌రి, సీపీఎస్ ర‌ద్దు అంటూ అవ‌గాహ‌న లేకుండా ఇచ్చిన హామీ సంగ‌తేంటి? ఇంత‌కీ జీపీఎస్ అంటే ఏంటి? గ‌తంలో ఏం జ‌రిగింది? ఇప్పుడేం జ‌రుగుతోంది?

మూడేళ్ల క్రితం చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సీపీఎస్‌ రద్దు చేయాలంటూ ఉద్యోగులు ఆందోళన చేశారు. చంద్రబాబు వాళ్లను చర్చలకు పిలిచారు. సీపీఎస్‌ రద్దు చేస్తే భవిష్యత్‌లో రాష్ట్రానికి విపరీతమైన నష్టం కలుగుతుంది కాబట్టి దానిని రద్దు చేయలేమని వారికి సూటిగా, స్పష్టంగా చెప్పారు. సీపీఎస్‌ బదులు అదనపు ప్రయోజనాలు కల్పించేలా జీపీఎస్‌ విధానం అమలు చేస్తామని చంద్ర‌బాబు ప్ర‌తిపాదించారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌.. తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామని అప్పటికే హామీ ఇచ్చారు. అది నమ్మిన ఉద్యోగులు ఆ రోజు చంద్రబాబు చెప్పిన జీపీఎస్ ప్ర‌తిపాద‌న‌ను వినేందుకు కూడా ఆసక్తి చూపలేదు. చర్చల నుంచి మ‌ధ్య‌లోనే వెళ్లిపోయారు. మళ్లీ చర్చలకు రాలేదు. ఇదంతా మూడేళ్ల క్రితం నాటి విష‌యం.

ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం సీపీఎస్‌ రద్దుకు మూడేళ్ల పాటు ఊరించి ఉసూరుమ‌నిపించింది. మాట త‌ప్పి.. మ‌డ‌మ తిప్పి.. ఇచ్చిన హామీని తుంగ‌లో తొక్కింది. త‌గ‌దున‌మ్మా అంటూ.. ఆనాడు చంద్రబాబు ప్రతిపాదించిన జీపీఎస్‌ను తెరపైకి తీసుకొచ్చింద‌ని అంటున్నారు. గతంలో చంద్రబాబు ఇంతకంటే మంచి ప్రతిపాదనలే తమ ముందు పెట్టారని.. అయినా తాము సీపీఎస్‌ రద్దుకే పట్టుబట్టి వాటిని వినేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేయలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. జీపీఎస్ అనే అంటున్నా.. ఇప్పుడు జ‌గ‌న్ తీసుకొచ్చిన ఆఫ‌ర్స్ కంటే.. ఆనాడు చంద్ర‌బాబు ఇస్తాన‌న్న జీపీఎస్ ఇంత‌కంటే మెరుగ్గా ఉంద‌ని అంటున్నారు. జ‌గ‌న్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. సీపీఎస్ ర‌ద్దు చేయ‌ర‌ని తెలిస్తే.. ఆనాడు వైసీపీకి మ‌ద్ద‌తుగా ఓటేసే వార‌మే కాద‌ని చెబుతున్నారు. ఈసారి ఎన్నిక‌ల్లో ఉద్యోగులంతా జ‌గ‌న‌న్న‌కు గ‌ట్టి బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu