త్వరలో గవర్నర్ రాజీనామా చేయనున్నారా?

 

ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం క్రమంగా చల్లబడుతున్న ఈ సమయంలో గవర్నర్ నరసింహన్ బాంబు లాంటి మాటొకటి పేల్చి కలకలం సృష్టించారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఇండో గ్లోబల్ ఫార్మా సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, “త్వరలోనే నేను కూడా సాధారణ పౌరుడుగా మారాతున్నాను,” అని అన్నారు. రెండు రాష్ట్రాలకి ప్రధమ పౌరుడుగా ఉన్న ఆయన సామాన్య పౌరుడు అవడం అంటే తన పదవి నుండి తప్పుకోవడమే.

 

కానీ ఇప్పుడు ఆయనని దిగిపొమ్మని కేంద్ర ప్రభుత్వం కానీ, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కానీ పట్టుబట్టడం లేదు. మొదట తెదేపా మంత్రులు, నేతలు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించినా ఆ తరువాత అచ్చెం నాయుడు వంటి వారు ఆయన మనసు నొప్పించినందుకు క్షమాపణలు కూడా చెప్పారు. ఆయనకీ ఇబ్బంది కలిగించే సెక్షన్: 8 గురించి కూడా ఇప్పుడు ఎవరూ గట్టిగా ఒత్తిడి చేయడం లేదు. క్రమంగా రెండు రాష్ట్రాల మధ్య పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొంటున్నాయి. ఇటువంటి సమయంలో ఆయన తన పదవి నుండి తప్పుకోవాలని ఎందుకు భావిస్తున్నారో తెలియదు. బహుశః ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యలు, వివాదాలు పరిష్కరించడం సాధ్యం కాదనే అభిప్రాయంతోనే ఆయన గౌరవప్రదంగా తప్పుకోవాలనుకొంటున్నారేమో? కానీ ఈరోజు ఒక ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ ఇదే అంశం మీద నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఒక బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ని రాజీనామా చేయమని ఎటువంటి ఒత్తిడి చేయలేదని, అసలు తమ ప్రభుత్వానికి అటువంటి ఆలోచనే లేదని స్పష్టం చేసారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu