రెజ్లర్ల ఆందోళన బీజేపీకి పట్టదా?

ఢిల్లీలో మహిళా రెజ్లర్ల  ఆందోళన పై దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. రెజ్లర్ల సమస్యపై  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వినా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలూ, సామాజిక వేత్తలు, మేధావులూ.. ఇలా అన్ని వర్గాలూ స్పందించాయి. రెజ్లర్లకు మద్దతుగా నిలిచాయి. అయితే ప్రధాని మోడీ మాత్రం ఈ విషయంలో ఇంత వరకూ నోరెత్తలేదు. పైగా పోలీసులు రెజ్లర్ల విషయంలో అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా నిరసన వ్యక్త అవుతోంది.

దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసేలా ప్రపంచస్థాయి పోటీలలో పతకాలను సాధించిన రెజ్లర్లు తన సమస్యలపై గళమెత్తితే.. కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాకుండా, వారి ఆందోళనను శాంతి భద్రతల సమస్యగా చూడటాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి.  రెజ్లర్ల  తమపై జరుగుతున్న లైంగిక వేధింపుల నుంచి రక్షణ కోరుతున్నారు. ఇది న్యాయమైన డిమాండే. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడైన బీజేపీ ఎంపీ  బ్రిజ్‌భూషణ్‌ సింగ్ పై ఈ రకమైన ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి.

అయినా కేంద్రం పట్టించుకోలేదు. పోలీసులు ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం లేదు. దేశానికి పతకాలు తెచ్చిన ఎంతో మంది మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ సింగ్ పై చేస్తున్న ఆరోపణలకు పూచికపుల్ల పాటి విలువ ఇవ్వడం లేదు. సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫోగట్‌, భజరంగ్‌ పునియా వంటి వారు బ్రిజ్ భూషణ్ సింగ్ పై ఆరోపణలు చేస్తున్నా  కేంద్రం, క్రీడాశాఖ ఉన్నతాధికారులు  ఎవరూ స్పందించడం లేదు.  ఎంపీకే  మద్దతుగా నిలుస్తున్నారు.

పోనీ బ్రిజ్ భూషణ్.. క్రీడాకారుడా అంటే కాదు. దేశానికి పతకాలు సాధించుకువచ్చిన మల్లయోధుడూ కాదు.. ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు.  అంతే కాదు అధికార పార్టీ ఎంపీ. ఇవే అర్హతలుగా ఆయనపై ప్రముఖ రెజ్లింగ్ క్రీడాకారులు చేస్తున్న ఆరోపణలను పరిగణనలోనికి తీసుకోవడానికి పోలీసు వ్యవస్థ ముందుకు రావడం లేదు. అదే సమయంలో రెజ్లర్ల ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేయడానికి క్షణమాత్రం సంకోచించడం లేదు.

ఘనత వహించిన బ్రిజ్ భూషణ్ సింగ్ పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఆయన కోట్లది రూపాయలు ట్నరోవర్ ఉన్న విద్యాసంస్థలకు అధిపతి కూడా. యూపీలోని పలు ప్రాంతాలలో బ్రిజ్ భూషణ్ బలమే వల్లే బీజేపీ ఉనికిలో ఉందన్న పరిస్థితి ఉంది. అందుకే అంత మంది రెజర్లు దాదాపుగా నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ఆయన పై చర్యలు తీసుకోవడానికి బీజేపీ వెనుకాడుతోంది.   రెజ్లర్ల విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ ప్రతిష్టను, మోడీ వ్యక్తిగత ప్రతిష్టనే కాదు.. దేశ ప్రతిష్టను సైతం మసకబారుస్తోంది. శాంతి యుతంగా ర్యాలీ చేస్తున్న రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల జులం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి.