గణతంత్ర వేడుకలు వేదికగా గవర్నర్ వర్సెస్ సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ల మధ్య గత మూడేళ్ళుగా సాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. గణతంత్ర దినోత్సవం వేడుకల విషయంలో తలెత్తిన వివాదం కోర్టు తలుపులు తట్టింది. గణతంత్ర వేడుకలను కేంద్ర ప్రభుత్వం సూచించిన పద్దతిలో నిర్వహించాలని రాష్ట్ర  హై కోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం బేఖాతరు చేసింది. పెరేడ్ గ్రౌండ్ లో ప్రజల సమక్షంలో ఘనంగా జరగవలసిన ఘణతంత్ర వేడుకలను రాజ్ భవన్  కే పరిమితం చేసింది. నిజానికి, జాతీయ రాజకీయాలపై కన్నేసిన కేసేఆర్  అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు, గవర్నర్ పై ఉన్న విభేదాల కారణంగా గణతంత్ర దినోత్సవానికి ప్రజలను దూరం చేశారు.  రాజకీయాలకు అతీతంగా విమర్శలను ఎదుర్కొంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా అనేక మంది రాజకీయ ప్రముఖులు, ముఖ్యమంత్రి కేసీఆర్  భారత రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని అవమానించిన తీరు పట్ల తీవ్ర అభ్యతరం తెలియచేస్తున్నారు. రాజ్యాంగాన్ని అవమానించిన ముఖ్యమంత్రి  దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.  

మరోవంక  గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళి సై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండి పడుతున్నారు . గవర్నర్ రాజ్యాంగ పదవిలో ఉంటూ ఓ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని మంత్రులు, అధికార బీఆర్ఎస్ ముఖ్య నేతలు భగ్గుమంటు న్నారు. ముఖ్యంగా, ఆమె చేసిన  ఫామ్ హౌస్  వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతల్లో కాక రేపుతున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్  లో స్పందించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కన్నా, దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని తెలిపారు. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా, రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడుతుందన్నారు. ఇలాంటి ప్రత్యేకమైన రోజున  సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్ కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. 

అలాగే  తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరోక్షంగా గవర్నర్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. గత ఎనిమిది సంవత్సరాల్లో రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, ఆసరా పెన్షన్లు, కంటి వెలుగు, వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి నడిపిస్తున్నారని అయినా  కొందరికి తెలంగాణ రాష్ట్రంలో  జరుగుతున్న అభివృద్ధి, అమలు అవుతున్న సంక్షేమ పథకాలు కళ్లకు కనపడటం లేదని, వాళ్లందరూ కళ్లున్న కబోదుల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ మాట్లాడటం ఏంటని ఆయన ప్రశ్నించారు.

 కాగా, గణతంత్ర వేడుకలపై ప్రభుత్వానికి నిబంధనలు తెలుసని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గణతంత్ర దినోత్సవం నాడు రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. గవర్నర్ రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినేలా మాట్లాడారన్నారు. గవర్నర్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాస్తామన్నారు. గవర్నర్ తమిళిసై విషయంలో రాష్ట్రపతి కల్పించుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

మరోవంక తెలంగాణ గవర్నర్ తమిళి సై మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుదుచ్చేరిలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య రిపబ్లిక్ డే వేడుకలు జరగకుండా చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చానన్నారు. ఖమ్మంలో  ఐదు లక్షల మందితో కేసీఆర్ బహిరంగ సభ పెట్టారని, ఆ సభకు లేని కరోనా నిబంధనలు గణతంత్ర వేడులకే గుర్తు వచ్చాయా? అని ప్రశ్నించారు.

రెండేళ్ల నుంచి రాజ్‌భవనంపై కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. ప్రభుత్వం రాజ్యాంగ విలువలు పాటించడంలేదని గవర్నర్ తమిళిసై ఆరోపించారు. దీంతో మరోమారు, గవర్నర్ వర్సెస్ సీఎం వివాదం ఢిల్లీ కోర్టుకు చేరింది. బంతి ఇప్పడు కేంద్రం కోర్టులో వుంది. కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తుంది? కోర్టు అంతిమ తీర్పు ఏమిస్తుంది? రాజ్యాంగానికి, త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానాన్ని దృష్టిలో ఉంచుకుని, కొందరు సోషల్ మీడియాలో సూచిస్తున్న విధంగా  సుప్రీం కోర్టు  సుమోటోగా జోక్యం చేసుకుంటుందా? కేసేఅర్ ప్రభుత్వాన్ని వివరణ కోరుతుందా? రాజకీయంగా, ముఖ్యంగా జాతీయ రాజకీయ పరమపద సోపాన పటానికి నిచ్చెనలు వేస్తున్న బీఆర్ఎస్  అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్  రాజకీయ ప్రస్థానంపై  ఎలాంటి ప్రభావం చూపుతుంది.. చూడవలసి వుంది.