చంద్రముఖిది కిడ్నాప్ కాదు..

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటి సారి ఓ ట్రాన్స్ జెండర్ బరిలో నిలిచారు. ఆమే చంద్రముఖి. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరపున గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అట్టహాసంగా నామినేషన్ వేసిన చంద్రముఖి ప్రచారం ముమ్మరం చేశారు. ఏమైందో ఏమో తెలియదు కానీ చంద్రముఖి మంగళవారం నుంచి ఆచూకీ తెలియడం లేదు. బంజారాహిల్స్ రోడ్‌నంబర్-2లోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్న చంద్రముఖి మంగళవారం వేకువజామున మూడు గంటల నుంచి కనిపించడం లేదని పలువురు ట్రాన్స్ జెండర్స్ పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు చంద్రముఖి మిస్సింగ్‌పై హైకోర్టులో ఆమె తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రముఖి ఎక్కడ ఉన్నా కోర్టులో ప్రవేశపెట్టేవిధంగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న పిటిషనర్ వినతిని కోర్టు అంగీకరించింది. ఈ మేరకు మధ్యాహ్నం విచారించిన న్యాయస్థానం రేపు ఉదయం 10.15 గంటలకు చంద్రముఖిని కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించింది.

కాగా చంద్రముఖి అదృశ్యం కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కీలక సమాచారం లభించింది. సీసీటీవీ ఫుటేజీలో చంద్రముఖి తానే స్వయంగా నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయని, తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్ ధరించిందని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. చంద్రముఖిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఆమె అదృశ్యమైందని చెప్పారు. చంద్రముఖి తన లాస్ట్ ఫోన్ కాల్స్ సహచర ట్రాన్స్‌జెండర్స్‌తో మాట్లాడిందని, ఆ తరువాత ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిందని డీసీపీ వెల్లడించారు. చంద్రముఖి ఆచూకీని కనుగొనేందుకు మొత్తం పది బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని, హైదరాబాద్‌తో పాటు అనంతపురం, ఇతర ప్రాంతాల్లో కూడా వెతుకుతున్నామని చెప్పారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే కేసును చేధిస్తామని డీసీపీ పేర్కొన్నారు.