చంద్రబాబు డిమాండ్ నేరవేరినట్లేనా

 

ముందు అన్నిసమస్యలకి పరిష్కారం చూపి, సీమంధ్ర ప్రజల భయాందోళనలు పోగొట్టి, ఆ తరువాత రాష్ట్ర విభజనపై అడుగు ముందుకు వేయమని కోరుతూ చంద్రబాబు డిల్లీలో నిరాహార దీక్ష చేసారు.

 

రాష్ట్ర విభజన కొరకు ప్రత్యేకంగా ఏర్పాటయిన కేంద్ర మంత్రుల బృందం నిన్నమొదటి సారి సమావేశమయిన తరువాత, రాష్ట్ర విభజన సందర్భంగా ఎదురయ్యే అన్ని సమస్యలకి నిష్పక్షపాతంగా పరిష్కారాలు చూపుతామని, అదేవిధంగా సీమంధ్ర ప్రజలు, నేతలు లేవనెత్తుతున్నఅన్నిసమస్యలకి పరిష్కరించి, వారి భయాందోళనలు తొలగిస్తామని ప్రకటించారు.

 

ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్నహోం మంత్రి సుషీల్ కుమార్ షిండే మాట్లాడుతూ తమ బృందం రాష్ట్ర విభజనపై పూర్తి నివేదిక తయారు చేసిన తరువాతనే, అది క్యాబినెట్ ముందుకు, అక్కడి నుండి రాష్ట్రపతికి, శాసనసభకి, పార్లమెంటుకి వెళుతుందని తెలిపారు.

 

అంటే తెదేపా కోరుతున్నట్లుగానే ముందు సమస్యలను పరిష్కరించిన తరువాతనే పార్లమెంటు ఆమోదానికి వెళ్ళబోతోందన్న మాట. అంటే చంద్రబాబు డిమాండ్స్ కు కేంద్రం అంగీకరించినట్లే భావించవచ్చును. కానీ, అంటోనీ కమిటీ వంటి ఒక డమ్మీ కమిటీని సృష్టించి దానితో టీ-నోట్ వరకు ఎంతో చాకచక్యంగా వ్యవహారం నడిపించిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు మంత్రుల బృందంతో మాత్రం అదే విధంగా కధ నడిపించదని భావించలేము.