యజమానికి షాకిచ్చిన మేక.. 66 వేల నోట్లు తినేసింది...
posted on Jun 8, 2017 12:39PM

ఆకలితో ఉన్న మేకకు పాపం ఆకులేవో.. డబ్బులేవో కూడా తెలియకుండా నమిలి మింగేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.66 వేల నోట్ల కట్టను తినేసి యజమానికి షాకిచ్చింది. ఈ విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా శిలువాపూర్ గ్రామానికి చెందిన రైతు సర్వేశ్ కుమార్ పాల్ ఇంటి నిర్మాణ పనుల కోసం రూ.66 వేలు నగదును తన ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. అందులో మొత్తం 33 రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయి. అయితే తనను కలవడానికి వచ్చిన వారితో మాట్లాడుతుండగా..ఈలోపు బయట ఉన్న మేక ఆయన జేబులోని నోట్ల కట్టను లాగేసి నమిలి మింగేసింది. ఇక యజమాని తేరుకునే సరికి జరగాల్సింది మొత్తం జరిగిపోయింది. మొత్తం 33 నోట్లలో 31 నోట్లు మేక కడుపులో చేరిపోయాయి. దాని నోట్లో ఉన్న రెండు నోట్లను లాగేయడంతో.. కేవలం రెండు నోట్లు మాత్రమే యజమానికి మిగిలాయి. దీంతో యజమాని బాధ చెప్పకుండా పోయింది. ఇక యజమాని బాధలో యజమాని ఉంటే.. మేకను చూసేందుకు మాత్రం ప్రజలు ఎగబడుతున్నారు. ఇక దానితో ఫొటోలు కూడా తీసుకొని సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేస్తుండటంతో ఇప్పుడిది వైరల్ అయింది.