ఆ పది నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు.. కేసీఆర్
posted on Aug 2, 2025 12:47PM
.webp)
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారా? 2023 ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత దాదాపుగా రాజకీయాలకు దూరమైనట్లుగా కనిపించిన ఆయన ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నారా? పార్టీని, పార్టీ శ్రేణులనూ స్థానిక ఎన్నికలకు సమాయత్తం చేయడానికి నడుం బిగించారా? అంటే తాజాగా ఆయన తన ఎర్రవెల్లి ఫాం హౌస్ నుంచి విడుదల చేసిన ప్రకటనను బట్టి చూస్తే ఔననే సమాధానమే వస్తున్నది.
శనివారం (ఆగస్టు 2) ఆయన ఆయన పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ గూటికి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తథ్యమనీ, ఆయా నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయనీ పేర్కొన్నారు. ఇప్పటి నుంచీ ఆయా నియోజకవర్గాలలో ఉప ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ నేతలూ, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. అలాగే పార్టీ సంస్థాగతంలో బలోపేతం చేయాల్సిన అవసరం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అయితే ముందుగా స్థానిక ఎన్నికలలో పార్టీని విజయం దిశగా నడిపించేందుకు సమాయత్తం కావాలనీ, అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలకు సన్నద్ధం కావాలనీ, ఆ ఎన్నికలలో విజయం సాధించిన అనంతరం పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతంపై దృష్టిసారిద్దామన్నారు.
ఇక పోతే బనకచర్ల విషయంలో రేవంత్ వైఖరిని ప్రజలలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బనకచర్ల నిర్మింతి తీరుతామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లు చెబుతున్నా.. నోరుమెదపకుండా తెలంగాణ సీఎం మౌనం వహిస్తున్నారని విమర్శలు గుప్పించారు. బనకచర్లపై రాజకీయ, న్యాయపరమైన పోరాటానికి బీఆర్ఎస్ సన్నద్ధం కావాలన్నారు.