ఒక్క పెళ్లి... 500కోట్లు గాలిలో!

ఆయనో రాజకీయ నేత. మాజీ మంత్రి కూడా. కాని, అసలు ప్రత్యేకత ఇవేవీ కావు! ఆయన గొప్పతనమంతా ఆయనపై మోపిన కేసులు, ఆరోపణల్లోనే వుంది!ఆయన మిగతా అవినీతిపరులు, అక్రమార్కుల్లా చిన్నా చితకా కుంభకోణాలు చేయలేదు! ఏకంగా భూమినే తవ్వి ... ప్రొక్లెయనర్లకు దొరికినంత దోచుకున్నాడు! అంతా చేసి తన అక్రమ సంపాదనతో తిరుమల వెంకన్న నెత్తిన కోట్లు ఖరీదు చేసే కిరీటం పెట్టాడు! అంతటి గనులు దోచిన ఘనుడాయన!

ఇంత చెప్పాక సదరు ఘన పదార్థం పేరు... గాలి జనార్దన్ రెడ్డి అని మీకు మళ్లీ చెప్పాలా? మూడేళ్లు జైల్లో వున్న ఐరన్ బాస్ గోల్డెన్ డేస్ అయిపోయాయని మీరు అనుకుంటున్నారా? దెన్... మీరోసారి గాలి జనార్దన్ తన గారాల పట్టి పెళ్లికి వేయించిన శుభలేఖను చూడాల్సిందే!

ఈ మధ్య గాలి జనార్దన్ రెడ్డి లాంటి ధనమున్న వాళ్ల పెళ్లిల్లు మరీ ధనాధన్ గా అవుతున్నాయి! ఆయన ప్రస్తుతం తాను కండిషనల్ బెయిల్ పై బయట వున్నప్పటికీ అన్ కండిషనల్ గా ఖర్చుపెడుతున్నాడు కూతురు పెళ్లికి! తండ్రిగా ఆయన వాత్సల్యం శుభలేఖలోనే తెలిసిపోతోంది. బాక్స్ లాగా వుండే వెడ్డింగ్ ఇన్విటేషన్ తెరవగానే వీడియో మోగిపోతుంది! చిన్న ఎల్సీడీ స్క్రీన్ పై ఆయన, ఆయన భార్య, కూతురు, కొడుకు, కాబోయే అల్లుడు అందరూ కనిపిస్తారు. మాంచి కన్నడ పాట ప్లే అవుతుంది బ్యాక్ గ్రౌండ్లో. శివుడ్ని పూజించటం మొదలు అల్లుడి వెనుక గుర్రాలు పరుగెత్తటం వరకూ... అబ్బో! భీభత్సంగా పిక్చరైజ్ చేశారు... గాలి పాటని!

వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ లో ఊరికే మాటలు, ప్రింట్ చేసిన అక్షరాలు కాకుండా ఏకంగా మనుషులే కనిపిస్తూ , సంగీతంతో కలిపి పాట పాడేస్తూ... శ్రావ్యంగా ఆహ్వానిస్తే... ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి? అయినా గాలి జనార్దన్ రెడ్డిగారంతటి మాజీ మంత్రి, ప్రస్తుత అండర్ ట్రయల్, అపర వేంకటేశ్వర భక్తుడు మిమ్మల్ని రమ్మన్నాక మీరు ఊరుకుంటారా? ఆ... ఊరుకుంటారా చెప్పండి? పైగా ఆయన పెళ్లిలో పెట్టబోయే విందు భోజనం... దాన్ని తలుచుకుంటేనే తహతహలాడిపోతారు ఎవరైనా! అలా వుండనుందట! అసలు వంటలు వండటానికి దేశం నలుమూలల నుంచీ వచ్చే వంట వాళ్లే చిన్న చితకా పెళ్లికి వచ్చే అతిథులంత మంది వుంటారట! ఇక అతిథులు ఏ సంఖ్యలో వస్తారో ఆలోచించండి!

గాలి జనార్దన్ రెడ్డి ఓ అయిదొందల కోట్లు పెట్టి... పదకొండు రోజుల పాటూ... కూతురు కళ్యాణం చేయటం తప్పంటారా? కానే కాదు! ఆయన ఆ మాత్రం ఖర్చు చేయాల్సిందే. కొడుక్కి వేలాది కోట్లు వారసత్వంగా ఇస్తున్నప్పుడు బిడ్డ కోసం కూడా కనీసం రెండు వందల కోట్లు పెళ్లి సంబరాల్లో వెదజల్లాల్సిందే! అప్పడే గాలి రాజావారి గాంభీర్యం తగ్గకుండా వుంటుంది. అంతే కాదు, గాలి జనార్ధన్ రెడ్డి లాంటి ఇనుప కుబేరులు అప్పుడప్పుడూ ఇలాంటి బంగారు పెళ్లిల్లు తలపెట్టాలి. అదే ప్రపంచంలో వేగంగా దూసుకుపోతున్న మన భారతీయ ఆర్దిక వ్యవస్థకు శ్రీరామ రక్ష! మధ్యలో దేశ ఆర్దిక వ్యవస్థ ఎందుకొచ్చిందీ అంటారా? అయితే ఈ మ్యాజిక్ లాంటి మ్యారేజ్ లాజిక్ వినండి... 

ఒక్క గాలి వారే కాదు... మన దేశంలో ఇంకా బోలెడు ఈదురు గాలుల వారూ వున్నారు, నల్ల సొమ్ము పోగేయటం విషయంలో! అందులో కొందరు జగన్నాటక అవినీతి సూత్రధారుల్ని అడ్డుపెట్టకునే కదా మన జనార్దనుడు ఇవాళ్ల ఎల్సీడీ తెరతో పెళ్లి ఆహ్వానాలు పంపే స్టేజీకి వచ్చారు! సరే... అద్భుతమైన ఆ అక్రమార్క త్రివిక్రమావతారం సంగతి ఎలా వున్నా ఇప్పుడు తమ ఇంట్లో మ్యారేజ్ మాత్రం గ్రాండ్ గా చేస్తున్నారట గాలి. బెంగుళూరు రోజుల తరబడి వెలిగిపోనుందట! అసలు ఇలాంటి మహా గ్రాండు పెళ్లిల్లు ఈ మధ్య బాగా ఎక్కువైపోతున్నాయి! ఎవరి రేంజ్ కు తగ్గట్టు వాళ్లు అరేంజ్ చేసుకుంటున్నారు... 

ఆ మధ్య ఓ సారి తమిళ సీఎం జయలలిత తన పెంపుడు కొడుకు పెళ్లికి హెలికాప్టర్లు వాడిందట! ఇలాంటి అబ్బురపరిచే పెళ్లి వార్తలు భారతీయులకి అలవాటే. పైగా వీటి వల్ల మార్కెట్ కి, ఆర్దిక వ్యవస్థకి మాంచి లాభం వుండటంతో అందరూ ఎంకరేజ్ కూడా చేస్తుంటారు! ఫలానా వారి పెళ్లిలో వెడ్డింగ్ కార్డ్ ఇలా వుంది, అమ్మాయి పెళ్లి చీర అలా వుంది, అబ్బాయి తలపాగా ఇంకోలా వుంది.... ఇవన్నీ ఇండియన్స్ కి ఎక్కడ లేని ఆసక్తి. అందుకే క్యాష్ చేసుకునే పనిలో మీడియా తలమునకలైపోతుంది! ఒక్క కెమెరా కూడా పెట్టుకోనీయని సానియా మీర్జా పెళ్లినే మనోళ్లు నానా రచ్చ చేసి సంబరం చేసుకున్నారు. మరిక పాటలు పాడి ఆహ్వానిస్తున్న గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లోని పెళ్లిని మీడియా ఊరుకుంటుందా? దగ్గరుండి నువ్వు కానియ్ రాజా... అంటూ బాజా, బజంత్రీలు మోగించదు? ఇలాంటి గొప్పోళ్ల ఇళ్లలో పెళ్లి వార్తలు ఇచ్చినప్పుడు వచ్చే టీఆర్పీల కథే వేరు!

పెళ్లి భోజనాల విస్తరాకుల్లో కోట్లు ఖర్చు చేసే రిచ్చెస్ట్ పీపుల్స్ మ్యారేజులంటే... అందరికీ పండగే! కారణం పెళ్లి జరిపించే పూజారికి ముట్టే వేలాది రూపాయల దక్షిణ మొదలు బంగారు ఆభరణాలు అమ్ముకునే గోల్డ్ వ్యాపారస్తులకు దక్కే కోట్ల లాభం వరకూ... అన్నీ అద్భుతమే! అన్నీ హంగామానే! అందరికీ లాభమే! ఇక రెగ్యులర్ గా పెళ్లి అంటే వుండే తలంబ్రాలు, బోజనాలు, లైట్లు, కార్లు, ఫంక్షన్ హాలు... ఇవన్నీ కాదు... గాలి జనార్దన్ రెడ్డి వారింట జరగనున్న పెళ్లి లాంటి వాటిలో అయితే ... బాలీవుడ్ తారలు కూడా వెలిగిపోనున్నారట! ఆ... ఏముంది... ఎంత పద్మశ్రీలు, జాతీయ అవార్డులు అందుకున్న వెండితెర వేల్పులైతే మాత్రం ఏంటి? కోట్లతో కొడితే పెళ్లికొచ్చి చిందేయక ఇంట్లో దాక్కుంటారా? తమ సినిమా పాటలకీ ధగధగ మెరిసే చిట్టిపొట్టి డిజైనర్ బట్టలు వేసుకుని బాలీవుడ్ హీరోయిన్స్ ఇలాంటి వేడుకల్లో తందనాలు ఆడకుండా వుంటారా? వాళ్ల డ్యాన్సులు ఈ రకం పెళ్లిల్లలో చీర్ గాల్స్ కి ఎక్కువ... రికార్డింగ్ డ్యాన్సులకి తక్కువా అన్నట్టు వుంటాయి! 

అసలు గొప్పోళ్ల మహా గొప్ప బ్లాక్ మనీ మ్యారేజెస్ కి తమనీ అలౌ చేయాలంటున్నారు పొట్ట కూటి కోసం కష్టపడే రికార్డింగ్ డ్యాన్సర్లు. కోట్లు పెట్టి బాలీవుడ్ భామలతో , సినిమా హీరోయిన్లతో , హీరోలతో డ్యాన్సులు చేయించుకున్నట్టే తమతో కూడా నాలుగు చిందులు వేయించుకుంటే తాము బతికేస్తాం కదా అంటున్నారు! ఈ విషయం ఆలోచించాల్సిందే! ఎలాగూ మీడియాలో దుమారంగా మారిపోతున్న ఈ కాలం కోట్ల రూపాయాల పెళ్లిల్లు... ఆచారం, సంప్రదాయం, సంస్కారం, సంస్కృతి ఏం లేకుండా... ఆర్భాటంగా మారిపోయాయి. మరిక రికార్డ్ స్థాయిలో జరిగే సదరు పెళ్లిల్లలో రికార్డింగ్ డ్యాన్సులు వేస్తే మాత్రం అడిగేదెవరు? పైగా ఆ రికార్డింగ్ డ్యాన్సర్లు వస్తే... సంగీత్, మెహందీ లాంటి నార్త్ ఇండియన్ సంబరాలు కూడా తెచ్చి పెట్టుకుంటున్న మనోళ్ల కళా పోషణకి తోడుగా వుంటుంది! పెళ్లి అవ్వాల్సిన వధువు, వరుడు, రెండు కుటుంబాల వాళ్లు ... వచ్చినా రాకున్నా పాడుతుంటారు, ఆడుతుంటారు కదా! ఆళ్లకి జోడీగా వుంటారు పాపం...  

ఏది ఏమైనా... గాలి జనార్దన్ రెడ్డి వారు తల పెట్టిన వాళ్లింటి భీభత్సమైన పెళ్లి చక్కగా జరగాలని అందరం కోరుకుందాం! ఎందుకంటే ఇలాంటివి అప్పుడప్పుడూ జరిగితేనే బీరువాల్లో, పరుపుల కింద, ఫామ్ హౌజుల్లో మూలిగే డబ్బుల కట్టలు ఒళ్లు విరుచుకుని బయటకొస్తాయి! నగలమ్ముకునే వాడి దగ్గర నుంచీ తిన్న ప్లేట్లు కడిగే పని వాళ్ల వరకూ అందరికీ సరఫరా అవుతాయి! లేకపోతే నల్లధనంగా ఎక్కడివక్కడే వుండిపోతాయి! అసలు ఇలాంటి వందల కోట్ల రూపాయల స్పెషల్ పెళ్లిల్లని ఆదయ పన్ను మినహాయింపు చట్టం కిందకి తేవాలి ప్రభుత్వం! అప్పుడు జరుగుతాయి అసలు సిసలు పెళ్లిల్లు! ఆ కళ్యాణ వైభోగం చూడటానికి రెండు కళ్లు సరిపోవు! చెప్పుకుంటే రెండు పెదాలు వాచిపోతాయి! ఇండియాలో గ్రాండ్ మ్యారేజెస్, బ్లాక్ మనీ... ఈ రెండింటికి క్రేజు తగ్గటం ఇప్పట్లో అయ్యే పని కాదు! అందుకే, చెమట ఎలాగూ వస్తుందనుకున్నప్పుడు... మాంచి పర్ఫ్యూమ్ అన్నా కొట్టుకోవాలి! ఏమంటారు?