అంతా బీఆర్ఎస్ బుస!

అబ్బో.. కేసీఆర్ అండ్ కో దగ్గర ఇలాంటి అప్పడం తెలివితేటలు కూడా వున్నాయన్నమాట! తెలంగాణ ప్రజల నుంచి భారీ స్థాయిలో తిరస్కారానికి గురైన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ వైపో, బీజేపీ వైపో చూస్తున్నారు. ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కి గుడ్ బై కొట్టేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొంతమంది కూడా త్వరలోనే ‘జై కాంగ్రెస్’ అనేసి కండువాలు మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా బీఆర్ఎస్ శాసనసభా పక్షం కాంగ్రెస్‌లో విలీనం అయ్యే ఛాన్సుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రెండ్రోజుల క్రితం ఒక వెరైటీ హడావిడి చేసింది. తెలంగాణ ప్రజల దృష్టిలో మరోసారి నవ్వులపాలైంది.

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత ఆయన ఏదో సందర్భంలో కేటీఆర్‌ని  కలిశారు. వెంటనే బీఆర్ఎస్‌ వాళ్ళు ఇదిగో బండ్ల కృష్ణమోహన్ మళ్ళీ బీఆర్ఎస్‌లో చేరిపోయాడు అంటూ ప్రచారం చేసేశారు. అక్కడితో ఆగకుండా అప్పటికే బీఆర్ఎస్ నుంచి విముక్తి పొందిన మరికొందరు ఎమ్మెల్యేల పేర్లను కూడా ప్రస్తావించి వీళ్ళు కూడా తిరిగి రాబోతున్నారు అని ఊదరగొట్టేశారు. తమ సొంత మీడియాలో కేసీఆర్ చాణక్యం తోటకూర కట్ట అంటూ స్పెషల్ స్టోరీలు కూడా ప్రసారం చేశారు. టోటల్‌గా ఏంటంటే, కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలెవరూ తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్ళలేదు. అందంతా ఒట్టి బుస అని తర్వాత తేలిపోయింది. ఈ నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శుక్రవారం కలిశారు. తాను కాంగ్రెస్ పార్టీని విడిచి పోలేదని స్పష్టం చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu