జగన్ బర్త్‌డే గిఫ్ట్.. పేదలకు ఉచితంగా ఇసుక డిమాండ్..
posted on Dec 21, 2021 12:11PM
ఏపీలో సీఎం జగన్ బర్త్‌డే వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అక్కడక్కడా వైసీపీలో కుమ్ములాటలూ బయటపడుతున్నాయి. ఫ్లెక్సీలు చింపుకోవడం.. సవాళ్లు చేసుకోవడం.. పార్టీ నేతను కొట్టి మళ్లీ కేక్ తినిపించడం.. ఇవన్నీ జగన్ పుట్టినరోజు స్పెషల్స్. వైసీపీ నేతలే కాదు.. టీడీపీ వారు సైతం తమదైన స్టైల్‌లో జగన్‌రెడ్డికి బర్త్‌డే విషెష్ చెబుతున్నారు. ఆ సందర్భంగా ఆసక్తికర కోరికలూ కోరుతున్నారు.
తాజాగా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నాదొక చిన్న కోరిక. పేదలకు ఉపయోగపడే ఇసుకను జన్మదిన కానుకగా జగన్ ఉచితం చేయాలి." అని సోమిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
టన్ను ఇసుక రూ.475 గా నిర్ణయించామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు రూ.900కి అమ్మడమేంటి అని సోమిరెడ్డి నిలదీశారు. ఇసుక తవ్వకాల్లో నెలకు రూ.600 కోట్ల అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జేపీ పవర్ వెంచర్స్ ద్వారా జరిగే ఇసుక తవ్వకాలు, సరఫరాపై సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలు పరిశీలిస్తే.. ఇసుక తవ్వకాల్లో దాగున్న వందల కోట్ల అక్రమాలు బయటపడ్డాయని తెలిపారు.