కాకాణి అరాచకాలు బయటపెడతా..సోమిరెడ్డి హెచ్చరిక
posted on Jul 30, 2025 8:06PM
.webp)
మాజీ సీఎం జగన్ రేపు నెల్లూరు పర్యటనపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఏ ముఖం పెట్టుకుని నెల్లూరు వస్తున్నారని చెప్పాలని సోమిరెడ్డి ప్రశ్నించారు . జగన్ మాట విని ఎంతోమంది అధికారులు ఊచలు లెక్కపెట్టారని, జగన్ వారిని పరామర్శించకుండా, కాకాణిని పరామర్శించేందుకు నెల్లూరుకు ఎందుకు వస్తున్నట్టు అని నిలదీశారు. మధ్యం కుంభ కోణంలో జైలుకు వెళ్లిన మిథున్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, ధనంజయరెడ్డిలను కూడా జగన్ పరామర్శించాలని సోమిరెడ్డి కోరారు.
"కాకాణి అక్రమాలతో ఎంతోమంది అధికారులు సస్పెన్షన్ వేటుకు గురయ్యారు... అప్పట్లో వైసీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు... రేపు జగన్ పర్యటన ముగియగానే కాకాణి దుర్మార్గాలన్నీ బయటపెడతా" అని హెచ్చరించారు. కాకాణి పాపాలకు బలైన వారిని కూడా జగన్ పరామర్శించాలని సోమిరెడ్డి స్పష్టం చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన లిక్కర్ పాలసీకి సంబంధించి జగన్ మాట విని చెవిరెడ్డి, కసిరెడ్డి, ధనుంజయరెడ్డి ఇలా చాలా మంది జైలుకు వెళ్లారని, వాళ్ల కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించడంలేదని నిలదీశారు. మరోవైపు జగన్ పర్యటన దృష్ట్యా జన సమీకరణకు పరిమితులు విధించింది. జిల్లాలో 30 యాక్ట్ అమల్లో ఉందని పర్యటన వేళ బయటకు రావద్దని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ సహా పలువురు వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.