పర్యావరణం పై రణం చేస్తే… పర్యవసానం దారుణం!

 

జూన్ 5… ప్రపంచ పర్యావరణ దినోత్సవం! ఇవాళ్ల మిగతా అన్ని స్పెషల్ డేస్ లో చేసినట్టే ప్రపంచ వ్యాప్తంగా జనం హడావిడి చేసేస్తుంటారు! స్పీచ్ లు, పాటలు, ఆటలు, టీవీ కెమెరాల హంగామా, ఆర్బాటం! ఇక సినిమా వాళ్లకంటే మరింత ఎక్కువ కెమెరా సెన్స్ వున్న పొలిటీషన్స్, ప్రకృతి ప్రేమికులు మొక్కలు పట్టుకుని ఇచ్చే ఫోజులైతే  మరీ సుందరంగా వుంటాయి! కాని, రేపట్నుంచీ ఏంటి పరిస్థితి? నిన్నటి దాకా ఏం జరిగిందో అదే! పర్యావరణంపై దారుణమైన రణం! చెట్లను నరుకుతూ…మనిషి కూర్చున్న కొమ్మనే నరుక్కునే పని దిగ్విజయంగా చేసేస్తుంటాడు!

 

సంవత్సరానికి ఓ సారి పర్యావరణం కోసం ఓ రోజు కేటాయించుకోవటం తప్పు కాదు! కాని, అసలు పర్యావరణం కోసం ఒక దినోత్సవం పెట్టుకోవాల్సిన ప్రమాదం ఎందుకు వచ్చింది? మనిషి స్వార్థం వల్ల! అభివృద్ధి అనే అందమైన క్యాన్ లోంచి మనం ప్రమాదం అనే ఇంధనం తీసి ఒంటి మీద పోసుకుంటున్నాం! ఇక అది ఎప్పుడు భగ్గున అంటుకుంటుందో ఎవరికీ తెలియదు! ఒబామా, ట్రంప్ మొదలు చిన్నా చితకా ఎన్జీవోలు నడిపే ఉద్యమకారుల వరకూ అందరూ పర్యావరణం ఎంతో ముఖ్యమనే అంటారు. కాని, సంవత్సరం తిరిగే సరికల్లా మన సీఎంలు, పీఎంలు నాటిన మొక్కలు మేకల నోట్లలోకి వెళ్లిపోతాయి! భూమీ మీది పచ్చదనం గతం కంటే ఇంకింత కుంచించుకుపోతుంది!

 

1880 నుంచీ 2013వ సంవత్సరం దాకా మన దేశంలో అడవులు ఎంతగా తగ్గిపోయాయో తెలుసా? 40శాతం! అడవులు వుంటేనే మనిషి బతకగలడని ఇంగితం వున్న ఎవరికైనా ఈ విషాదం ఒళ్లు గగుర్పొడిపిస్తుంది! మళ్లీ 40శాతం అడవులు భారతదేశంలో పెరగాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? ఊరికే మీడియా ముందు ఒక అడుగు లోతు గుంటలో మూరెడు మొక్కొక్కటి నాటేస్తే అడవులు తయారైపోతాయా? అంతే కాదు, ప్రస్తుతం భారతదేశంలో అడవుల రూపంలో వున్న భూమి 24శాతం! కనీసం 30-35 శాతం భూమి అడవులతో పచ్చగా వుండకపోతే తీవ్రమైన ప్రమాదం! కాని, వున్న 24శాతం అడవుల్ని కూడా అరగదీసే ఆలోచనలే నడుస్తున్నాయి!

 

అడవుల్ని రక్షించుకోవాలంటే విచ్చలవిడి అభివృద్ధి కుట్రలు మానాలి. పెరిగిన జనాభకి తగ్గట్టుగా ఉపాధి కోసం అభివృద్ధి అవసరమే కాని అది పర్యావరణాన్ని నాశనం చేసి అస్థిత్వానికే గండం తెచ్చేది కాకూడదు. అడవుల్ని తగ్గకుండా చూసుకుంటే పెరిగేలా చేయటమే అసలైన అభివృద్ధి. రోడ్లు, భవనాలు, బ్రిడ్జ్ లు, నీటి ప్రాజెక్ట్ ల కోసం అడవుల్ని తుడిచి పెట్టేయటం అభివృద్ధి కాదు! అది ఆత్మహత్య! ఈ సత్యం మనం గ్రహించాలి. మనమే కాదు ప్రపంచం మొత్తం పర్యావరణం విషయంలో శ్రీరంగ నీతులే చెబుతోంది! పాటించే దగ్గరికి వచ్చే సరికి మాత్రం అమెరికా మొదలు ఆఫ్రీకా దేశాల దాకా అన్నీ కాలుష్యానికి కాలుదువ్వుతున్నాయి. మనకున్న ఒకే ఒక్క భూమండలాన్ని మాడిపోతోన్న పెనంలా మార్చేస్తున్నాం!

 

పచ్చదనాన్ని కాపాడే ప్రయత్నాలు నిజంగా చేయదలిస్తే ముందు ఏం చేయాలి? అడ్డగోలు రూల్సు పెట్టి అడవుల చుట్టుపక్కల గ్రామాల నిరుపేదల్ని ఇబ్బంది పెట్టడం కాదు. అడవిలోకి పోయి కట్టెలో, తేనో, ఆకులు, అలములో తెచ్చుకునే పూట గడవని వార్ని మన వాళ్లు జైల్లో కూడా పెడుతుంటారు! కాని, స్మగ్లింగ్ కో్సం వేల చెట్లు తెగ నరికే వార్ని పట్టుకోలేకపోతున్నామని చెబుతూ వదిలేస్తుంటారు! ఫ్యాక్టరీలు లక్షల మైళ్ల అడవుల్ని తుడిచి పెట్టేస్తుంటే మౌనం వహిస్తారు! ఇవన్నీ అసలు సమస్యలు!

 

పర్యావరణాన్ని మనం సరైన సమయంలో కాపాడుకోకపోతే… తరువాత అది తెచ్చే ప్రళయం నుంచీ మనల్ని కూడా ఎవరూ కాపాడలేరు. ఈ సత్యం గ్రహించి ఒకప్పటిలా మనం ప్రతీ చెట్టునీ, పుట్టనీ దైవంగా భావించి ఆరాధించాలి. పచ్చ నోట్ల కంటే పచ్చదనం ఎంతో ముఖ్యమని అర్థం చేసుకుని తరువాతి తరాలకి భూమిని అత్యంత భద్రంగా అప్పజెప్పాలి!