బ్రాస్‌లెట్ కోసం ఫ్లెక్సీ!

ఒక బొమ్మ కోసం ఒక‌మ్మాయి ల‌వ‌ర్‌తో గొడ‌వ‌ప‌డి బొమ్మ తెచ్చిస్తేనే నిన్ను పెళ్లాడ‌తాన‌ని అంటుంది. వాడు వూరంతా తిరిగి ఓ దుకాణంలో అలాంటిదే కొనిస్తాడు. ఆమె ప‌రిశీల‌న‌గా చూసి బొమ్మ‌ని పారేసి, స‌ద‌రు ప్రేమికుడిని ఇక క‌ల‌వ‌ద్ద‌ని వారిస్తుంది. కావ‌డానికి ఇదో సినిమా సీన్‌. కానీ ఆ బొమ్మ‌కి ఆ అమ్మాయికి ఉన్నఅనుబంధం గ‌ట్టిదే. అది తాను టెన్త్‌లో ఉండ‌గా వాళ్ల డాడీ కొనిచ్చాడు. ఆయ‌న చ‌నిపోయిన త‌ర్వాత దాంతోనే ఎక్కువ మాట్లాడుతూండేది. అదో బంధం. అది అంద‌రికీ అర్ధ‌మ‌య్యేది కాదు. దానితో మాట్లాడుతూంటే తండ్రితో మాట్లాడుతున్న‌ట్టే ఉంటుంది. ఇదో సెంటిమెంటు కూడా. అందువ‌ల్ల అలాంటి వ‌స్తు వులు ఎవ‌రూ వ‌దులుకోరు, పారేసుకోరు. ప్రాణంతో స‌మానంగా చూసుకునే బ్రాస్‌లెట్ పోగొట్టుకున్న కుర్రాడు మ‌రెంత‌గా బాధ ప‌డుతున్నాడో. అది తెచ్చిచ్చిన‌వారికి త‌గిన బ‌హుమ‌తి ఇస్తాన‌ని ఏకంగా  ఫ్లెక్సీ పెట్టేడు!

తల్లి జ్ఞాపకార్ధం గా ఉంచిన బ్రాస్‌లైట్‌ కనిపించకుండా పోయిందని, దానిని అందజేసిన వారికి తగిన బహుమతి ఇస్తానంటూ పుదుకోట జిల్లా పొన్నామరావతికి చెందిన నారాయణన్ విజ్ఞప్తి చేస్తున్నాడు. తల్లి కానుకగా ఇచ్చిన బ్రాస్‌లెట్‌ను ఆమె మరణా నంతరం జ్ఞాపకంగా నారాయణన్‌ ధరిస్తున్నాడు. ఆగ‌ష్టు 22వ తేది ఉసిలంపట్టిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొచ్చిన నారా యణన్‌ బ్రాస్‌లెట్‌ కనిపించకపోవడంతో దిగ్ర్భాంతి చెందాడు. పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో తాను వెళ్లి వచ్చి న దారిలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశాడు.

అందులో తల్లి జ్ఞాపకంగా ఉన్న బ్రాస్‌లెట్‌ కనిపించలేదని, అందజేసిన వారికి తగిన బహుమతి అందిస్తానంటూ పేర్కొన్నాడు. ఆ ఫ్లెక్సీ ఉన్న దారంట వెళ్లేవారు ఈస‌రికే చాలామంది న‌వ్వుకుని ఉంటారు. నేను ఫ‌లానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని ల‌వర్స్ పెట్టుకోవ‌డం చూశాంగాని వీడెవ‌డండీ, పోయిన వ‌స్తువు కోసం ఇలా ప్ర‌చారం చేస్తారా?   వెర్రిగాని! అంటూ ఎగ‌తాళిగా న‌వ్వు కున్నారు కొంద‌రు యువ‌కులు. కానీ అంత ప్రచారం చేస్తున్నాడంటే దాని వెన‌క ఉన్న అనుబంధ బ‌లం అలాంటిది. త‌ల్లి లేని లోటు తీర్చ‌డం చాలా క‌ష్టం. ఆమె యిచ్చిన బ్రాస్‌లెట్‌తో కాలం గ‌డుపుతున్న‌వ్య‌క్తికి అది కూడా దూర‌మ‌యితే న‌ర‌క‌ యాత‌నే. అది చేతికి ఉంటే అమ్మ‌చేతిని ప‌ట్టుకుని న‌డుస్తున్న‌ట్టే ఉంటుంది. ప్లీజ్‌.. బ్రాస్‌లెట్ దొరికితే ఇచ్చేయండి... అత‌నికి త‌ల్లిని ద‌రిచేర్చిన‌ట్ట‌వుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu