బాబోయ్ దేశంలో వీఐపీలు ఇంత మందా?
posted on Feb 7, 2025 8:32AM

దేశాన్ని వీఐపీ కల్చర్ దివాళా తీయిస్తోంది. లెక్కకు మించిన వీఐపీల వల్ల ఖజానా నిండుకుంటోందా? అంటూ ఔననే సమాధానమే వస్తుంది. దేశంలో వీఐపీలు అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్, అదీ ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన వారి సంఖ్య లక్షన్నర కంటే ఎక్కువే అంటే నమ్మగలరా? కానీ ఇది అక్షరాలా నిజం. అధికారికంగా ప్రభుత్వం గుర్తించిన వీఐపీల సంఖ్య దేశంలో లక్షా ఎనభై వేల మంది. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో వీఐపీలు లేరంటే అతిశయోక్తి కాదు. అగ్రరాజ్యం అమెరికా నుంచి తీసుకుంటే ప్రపంచంలో ఏ దేశంలోనైనా గుర్తింపు పొందిన వీఐపీల సంఖ్య వందలలోనే ఉంది. ఒక్క ఇండియాలో మాత్రమే ఈ సంఖ్య లక్ష దాటేసింది.
ఔను నిజం ఇండియాలో వీఐపీల సంఖ్య అక్షరాలా లక్షా 80 వేలు. అదే అగ్రరాజ్యం అమెరికాలో వీఐపీల సంఖ్య కేవలం 252. ఒక్క అమెరికా అను కాదు బ్రిటన్ లో వీఐపీల సంఖ్య కేవలం 84, రష్యాలో 312. చైనాలో 435. మరి భారత్ లోనే వీరి సంఖ్య ఇంత అపరిమితంగా ఉంది. వీఐపీలు ఎక్కువ మంది ఉండటం మంచిదే కాదా? దీని వల్ల నష్టం ఏముంది? అనుకుంటున్నారా? ఉంది. లేకపోవడమేం చాలా చాలా ఉంది.
వీఐపీలందరికీ ఉండటికి క్వార్టర్స్, భద్రతా సిబ్బంది, గన్మన్లు, ఉచిత ఫోన్, గ్యాస్, ఇక వీఐపీలకు వ్యక్తిగత సహాయ సిబ్బంది, ఉచిత రవాణా, విదేశీ పర్యటనలు, అటెండర్లు, వంటమనిషి, పీఏ, ఓఎస్డీ, క్యాంటిన్లలో రాయితీలు,కారు, డ్రైవర్ ఇవే కాకుండా ఇతర అలవెన్సులు వీటికయ్యే ఖర్చంతా ప్రజల సొమ్మే కదా? ఈ వీఐపీల జాబితాలో రాష్ట్ర కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడు కూడా చిన్న బోతుంది.
నిజానికి 70వ దశకం వరకూ ఎమ్మెల్యే,ఎంపీలు సేచ్ఛగా ప్రజల్లో తిరిగేవారు. వారి ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లో సీట్లు రిజర్వ్ చేసి ఉండేవి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా ప్రజా రవాణాను వినియోగించడం లేదు. ప్రజలతో సంబంధం లేకుండా దర్జాగా కార్లలో మందీ మార్బలంతో తిరిగే సంస్కృతి పెచ్చరిల్లింది. దేవుడి దర్శనం నుంచి ప్రతిచోట వీఐపీలకు ప్రత్యేక సదుపాయాలు. ప్రొటో కాల్ లు. దీనంతటికీ ప్రజాధనం దుబారా. ఈ పరిస్థితి మారితేనే ప్రజల సమస్యలు కొంత వరకైనా పరిష్కారం అవుతాయి. దేశంలో అభివృద్ధి పథకాలకు నిధుల కొరత కొంత వరకైనా తగ్గుతుంది.