బడ్జెట్ బాగుంటే తారాజువ్వలా... లేదంటే కుదేలే... నిర్మలమ్మ పద్దు ఎలాగుంటుందో?

తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌ రెండోసారి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే, ఉల్లి ధరల నుంచి ఆర్ధిక మందగమనం వరకు అనేక సవాళ్లు నిర్మలా సీతారామన్ ముందు కనిపిస్తున్నాయి. దేశ ఆర్ధిక పరిస్థితి... ప్రపంచ రాజకీయాలు... ఇలా అన్నీ భారత్‌కు ప్రతికూలంగా పరిణమించాయి. ముఖ్యంగా దేశ ప్రగతిని ముందుకు నడిపించే జీడీపీ వృద్ధిరేటు పతనం కావడం... నిరుద్యోగ రేటు 40ఏళ్ల గరిష్టానికి చేరడం... ఆటోమొబైల్‌ పరిశ్రమ కుదేలవడం వంటి సమస్యలు... ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌కు సవాళ్లు విసురుతున్నాయి. వృద్ధి అంచనాలు కూడా 42ఏళ్లలో అతిస్వల్పంగా నమోదుకావడం కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధి రేటు, ఆర్ధిక మందగమనం పెనుసవాలు విసురుతున్నాయి. ఇలాంటి, పరిస్థితుల్లో దేశంలో అన్ని వర్గాలను సంతృప్తిపర్చేలా కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం కత్తి మీద సామే అంటున్నారు.

అయితే, నిర్మలా బడ్జెట్‌ అన్ని వర్గాలను ఆకట్టుకుందో లేదో స్టాక్ మార్కెట్లు క్షణాల్లో చెప్పేస్తాయని ఆర్ధిక విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వ వ్యయాలు బాగుండి... వ్యవస్థలోకి నగదు ప్రవాహం ఉండేలా చూస్తే మార్కెట్లు తారాజువ్వలా పెరుగుతాయని... బడ్జెట్ బాగుందనడానికి ఇదే రుజువని చెబుతున్నారు. ఒకవేళ ఆత్మరక్షణ వ్యూహంతో బడ్జెట్ సాగితే మాత్రం మార్కెట్లు భారీగా పతనమవడం ఖాయమని అంటున్నారు. గతేడాది నిర్మలా బడ్జెట్ తర్వాత మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయని... దానికి అనుగుణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా ఇబ్బందుల్లోకి జారిపోయిందని గుర్తుచేస్తున్నారు.

ఈసారి బడ్జెట్‌లో ప్రధానంగా ఆరు రంగాలకు సంబంధించి కీలక నిర్ణయాలు ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్, అగ్రికల్చర్, ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్‌, మెటల్‌ అండ్ ఇన్వెస్ట్‌ మెంట్‌ రంగాలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్‌ ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా, గత పదేళ్లలోనే అత్యంత కష్టమైన బడ్జెట్‌గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి, నిర్మలమ్మ... ఈ సవాళ్లను ఎలా అధిగమించి... అందరినీ మెప్పించేలా బడ్జెట్‌ను ప్రవేశపెడతారో లేదో చూడాలి. అయితే, నిర్మలమ్మ బట్జెట్ బాగుంటే స్టాక్ మార్కెట్లు తారాజువ్వల్లా లేస్తాయని... లేదంటే, భారీగా పతనమవుతాయని... అన్ని వర్గాలను సంతృప్తిపర్చారో లేదో తెలియాలంటే ఇదే రుజువు అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu