ఎట్టకేలకు చిక్కిన చిరుత... ఊపిరి పీల్చుకున్న శంషాబాద్ వాసులు 

ఎట్టకేలకు చిరుత చిక్కింది. శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో ఆరు రోజులుగా సంచరిస్తూ అందరినీ కలవరపెట్టిన చిరుత చివరకు పట్టుబడింది. అటవీ శాఖ అధికారులు అమర్చిన బోనులో ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చి అందులో చిక్కుకుంది. దీంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ఆ చిరుతను తొలుత నెహ్రూ జూపార్క్ కు తరలించనున్నారు. చిరుత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొనేందుకు దానికి వైద్య పరీక్షలు నిర్వహించనన్నారు. అనంతరం ఒక రోజుపాటు జూ అధికారుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. ఆరోగ్యంగానే ఉందని నిర్ధారణ అయ్యాక చిరుతనునల్లమల అడవిలో విడిచిపెడతామని అటవీ శాఖ అధికారులు చెప్పారు. 
గత నెల 28న ఆదివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టు వెనకున్న గొల్లపల్లి అటవీ ప్రాంతం నుంచి రక్షణ గోడ దూకి చిరుత విమానాశ్రయం ఆవరణలోకి వచ్చింది. అయితే దూకుతున్న సమయంలో ప్రహరీ గోడకు అమర్చిన విద్యుత్ ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ రూమ్‌లో అలారం మోగింది. దీంతో ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమరాలను పరిశీలించగా అందులో చిరుత కనిపించడం, ఎయిర్ పోర్టు రన్ వేపై తిరుగుతుండటంతో వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు చిరుతను బంధించేందుకు ఐదు బోన్లు, 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు కొన్ని మేకలను వాటి వద్ద ఎరగా వేశారు. కానీ చిరుత మాత్రం పలుసార్లు బోన్ల వద్దకు వచ్చినా మేకలను తినేందుకు లోనికి వెళ్లలేదు. చివరకు తినేందుకు ఏమీ దొరక్కపోవడంతో బోనులోని ఎరలను తినేందుకు వచ్చి చిక్కింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu