పండగ బహుమానంగా ధరల పెరుగుదల
posted on Sep 12, 2012 10:34AM
పండగ సీజన్ వస్తోందంటే చాలు... సామాన్యుడి గుండె భయంతో వణకిపోతోంది. అడపాదడపా పెంచేస్తున్న ధరలు ప్రభుత్వ నేతలకు అంత సంతృప్తిగా లేవేమోమరి... ఈ సారి పండగ సీజన్లో పెట్రోలుతోబాటు నిత్యావసర వస్తువుల ధరలుకూడా పెంచెయ్యాలని ప్రభుత్వం కంకణం కట్టేసుకుంది. పెట్రోలుతో సహా ఇతర ఇంధనధరలు ఈవారంలోనేపెంచాలని ప్రభుత్వం అనుకున్నప్పటీకీ ` బొగ్గుకుంభకోణం నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేసిన ప్రతిపక్షాలు ధరల పెంపును మరో పెద్ద ఇష్యూ చేస్తాయని భావించి, ముందుజాగ్రత్తగా వచ్చే వారానికి ఈ ప్రతిపాదనను వాయిదా వేసేసింది. అలాగే పండగ సీజన్‌లో నిత్యావసర వస్తువులకు ఉండే డిమాండ్‌ను ఆధారంగా చేసుకుని చక్కెర, వంటనూనెలు, పప్పుదినుసులు సుమారు 15 శాతం మేరకు ధరలు పెరగనున్నాయని ఇటీవల జరిగిన సర్వేలు హెచ్చరిస్తున్నాయి. వినాయకచవితితో ప్రారంభమైన పండగాల సీజన్ దసరా, దీపావళి, సంక్రాంతి వంటి వరుస పండుగలతో సుమారు ఉగాది వరకూ కొనసాగుతుంది. అంటే ఇప్పుడు పెరిగిన ధరలు దాదాపుగా ఆర్నెల్లపాటు కొనసాగి, ఆ తర్వాత అక్కడే స్థిరపడి పోతాయన్నమాట ! అందుకే` దీన్ని పండగ సీజన్ అనేకన్నా వడ్డింపు సీజన్ అంటే సమంజసంగా ఉంటుందంటున్నారు సామాన్యజనం.