చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి!
posted on Aug 7, 2023 7:30AM
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం తొలి నాలుగు రోజులు ప్రశాంతంగా సాగినా.. శుక్రవారం నుండి సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి కార్యక్రమంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంటోంది. అన్నమయ్య జిల్లాలో మొదలై చిత్తూరు జిల్లాలో రంగరంగంగా మారగా.. శనివారం శ్రీకాళహస్తిలోనూ అదే టెన్షన్ కొనసాగింది. శనివారం చంద్రబాబు శ్రీకాళహస్తిలో రోడ్ షో, సభ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు శ్రీకాళహస్తిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. అసలే టెన్షన్ వాతావరణం ఉండగా.. మున్సిపల్ సిబ్బంది చర్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.
ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించగా.. టీడీపీ నేతలు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్నారు. ఫ్లెక్సీలను ఎందుకు తొలగిస్తున్నారో చెప్పాలని.. వారిని అడ్డుకొని వాగ్వివాదానికి దిగారు. మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఆదేశాలతోనే తాము ఈ ఫ్లెక్సీల తొలగింపునకు వచ్చామని మున్సిపల్ సిబ్బంది చెప్పడంతో మున్సిపల్ కమిషనర్ తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముందే అనుమతి తీసుకుని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినప్పటికీ.. తొలగించమని సిబ్బందికి ఆదేశాలివ్వడం ఏంటని పసుపు సైన్యం వాగ్వాదానికి దిగింది. స్థానిక వైసీపీ నేతల ఒత్తిడితోనే మున్సిపల్ కమిషనర్ ఈ ఆదేశాలిచ్చినట్లు కలకలం రేగగా.. ఫ్లెక్సీలను తొలగిస్తే తీవ్ర చర్యలు తప్పని టీడీపీ నేతలు హెచ్చరించడంతో చంద్రబాబు రాకకు ముందే ఇక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇక, చంద్రబాబు సభలో మాట్లాడుతూ.. అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రజల సమస్యలపై తాను మాట్లాడితే తనపై పోలీసులతో దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల్ని నేరాల్లో భాగస్వాముల్ని చేద్దామని వైసీపీ చూస్తోందని.. ఒకరిద్దరు చెడిపోయిన పోలీసు ఉన్నతాధికారుల వల్ల మంచి పోలీసులకు చెడ్డపేరు వస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీసులకు ప్రభుత్వం టీఏ, డీఏలు కూడా ఇవ్వడం లేదనీ, టీడీపీ కార్యకర్తల్ని కొట్టమని మాత్రం లాఠీలు ఇస్తున్నదని దుయ్యబట్టారు. ఇక, అక్కడ నుండి శనివారమే నెల్లూరుకు వచ్చిన చంద్రబాబు.. సోమశిల ప్రాజెక్టును పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. సోమశిల, కండలేరు పనులకు బిల్లులు చెల్లించక పనులు ఆపేశారని.. పనులు ఆగిపోవడంతో సోమశిల డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉందన్నారు. గండిపాలెం కాలువల నిర్వహణ గాలికి వదిలేశారని, పెద్దిరెడ్డి సాగర్ పనులకు బిల్లులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
శనివారం రాత్రి అక్కడే బస చేసిన చంద్రబాబు.. ఆదివారం ఉదయం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు.. రైతుల సభలో ప్రసంగించారు. ఇక, నాలుగు గంటలకు అక్కడి నుంచి దెందులూరు వెళ్లారు. కాగా, గతేడాది ఆగస్టు 31న గుండ్లకమ్మ ప్రాజెక్టులో 3వ గేటు పూర్తిగా కొట్టుకుపోగా.. 6, 7 గేట్లు పాక్షికంగా దెబ్బతినగా.. అప్పుడు ప్రాజెక్టులోని రెండు టీఎంసీల నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చింది. గుండ్లకమ్మ ఆయకట్టు రైతులకు సాగునీరు అందకుండా పోయింది. ఇది జరిగి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్ల మరమ్మతు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఏడాది లాగా ఈ ఏడాది కూడా వర్షాలు ముందే కురిసి ఉంటే రైతులకు నీరందేది కాదు. ఇక ఇప్పటికీ నత్త నడకన సాగుతున్న ఈ ప్రాజెక్ట్ పనులు ఈ ఏడాది అయినా పూర్తవుతాయో లేదో చూడాల్సి ఉంది. చంద్రబాబు ఇదే విషయంపై వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి కడిగిపారేశారు.
కాగా, చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన, ఆ సందర్భంగా చేస్తున్న విమర్శలు, సంధిస్తున్న ప్రశ్నలతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. అసలే ప్రజలలో వ్యతిరేకత తారస్థాయికి చేరగా, ఒక్కసారిగా సమాజానికి జీవనదుల లాంటి ప్రాజెక్టుల విధ్వంసం అంటూ చంద్రబాబు ప్రజలలో చైతన్యం తీసుకువస్తుండడంతో ఇక తమ పనైపోయినట్లేనని అర్ధమైన వైసీపీ ఏదో ఒక విధంగా చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నది. అందులో భాగమే పుంగనూరులో వైసీపీ కార్యకర్తల విధ్వంసకర వీరంగం, శ్రీకాళహస్తిలో మున్సిపల్ సిబ్బందిని రంగంలోకి దింపడం. అయితే, చంద్రబాబు అన్నటినీ అధిగమించి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను చుట్టేస్తున్నారు. ఈ పర్యటన పూర్తయ్యేలోపు వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల అంశంలో అధఃపాతాళానికి పడిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.