రాజధానికి కదిలిన రైతుల దండు!  సరిహద్దుల్లో వేలాది ట్రాక్టర్లు  

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలుగా అలుపెరగని పోరాటం చేస్తున్న రైతులు  తుది సమరానికి కదిలారు. గణతంత్ర దినోత్సవం రోజే దేశ రాజధానిలో ర్యాలీకి దండుగా కదలివస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లే దారులన్ని రైతులతో వస్తున్న ట్రాక్టర్లతో నిండిపోయాయి. వేలాది ట్రాకర్లలో రైతులు ర్యాలీగా హస్తినకు వస్తున్నారు. దీంతో వందలాది కిలోమీటర్ల మేర ట్రాక్టర్లే కనిపిస్తున్నాయి. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ నుంచి ఢిల్లీకి ఎంటరయ్యే సరిహద్దులకు ఇప్పటికే వందలాది ట్రాక్టర్లు చేరుకున్నాయి. ఇంకా వేలాదిగా తరలివస్తున్నాయి. దీంతో గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో రైతులు జరప తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ టెన్షన్ పుట్టిస్తోంది. 

రాజ్‌పథ్‌ మార్చ్‌లో వివిధ రాష్ట్రాల శకటాలు సాగినట్లే రైతులు కూడా కొన్ని ట్రాక్టర్లను వివిధ ఆకృతులతో కూడిన శకటాలుగా రూపొందిస్తున్నారు. రైతు జీవనం, దేశానికి రైతు అవసరం, రైతుల దుస్థితి, సాగుచట్టాల వల్ల అనర్థాలు, మారుతున్న జీవన విధానాలు.. వీటన్నింటినీ వివిధ రూపాల్లో ప్రదర్శిస్తారు. ప్రతీ ట్రాక్టర్‌పైనా మువ్వన్నెల జెండా తప్పనిసరిగా ఉండేట్లు చర్యలు తీసుకుంటున్నారు. పంజాబ్‌లోని లూధియానా నుంచి కర్తార్‌సింగ్‌ అనే రైతు 160 కి.మీ. దూరం రివర్స్‌ గేర్‌లో ట్రాక్టర్‌ నడుపుకుంటూ ఢిల్లీ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చాడు. తన మాదిరిగానే ప్రధాని నరేంద్ర మోడీ సాగు చట్టాలను రివర్స్‌ చేయాలని ఆయన కోరారు.  రైతుల ట్రాక్టర్లకు డీజిల్‌ నిరాకరించాలని ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కోరింది. ఢిల్లీ దిశగా వెళ్లే ఏ ట్రాక్టర్‌కూ డీజిల్‌ అందివ్వరాదని అనేక పెట్రోల్‌ బంకులకు ప్రభుత్వాధికారుల నుంచి ఆదేశాలు అందాయని తెలుస్తోంది. ఈ విషయం రైతులకు తెలియడంతో చాలా చోట్ల బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. 
  
రైతుల ట్రాక్టర్ ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. రాజ్‌పథ్‌లో రిపబ్లిక్‌ డే పరేడ్‌ ముగిసిన తరువాతే అంటే ఉదయం 11-30 గంటల తరువాతే ట్రాక్టర్‌ ర్యాలీ ఆరంభం కావాలి. పోలీసుల షరతులకు రైతులు కూడా అంగీకరించి.. వాళ్ల రూట్ మ్యాప్ ఇచ్చారని చెబుతున్నారు. రాజ్‌పథ్‌లో రిపబ్లిక్‌ డే ముగిశాకే.. రైతుల కోసం ఢిల్లీ సరిహద్దుల్లోని బ్యారికేడ్లను తొలగిస్తారు. ట్రాక్ట ర్‌ ర్యాలీని మూడు సరిహద్దు పాయింట్ల నుంచి అంటే సింఘూ, టిక్రీ, గాజీపూర్‌ల వైపు నుంచి అనుమతిస్తా రు. పల్వాల్‌, షాజహాన్‌పూర్‌ అంటే రాజస్థాన్‌ వైపు నుంచి కూడా అనుమతించే అవకాశం ఉందని రైతు నాయకులు చెబుతున్నారు.  

 టిక్రీ నుంచి 63 కిమీ, సిం ఘూ నుంచి 60 కి.మీ, గాజీపూర్‌ నుంచి 46 కిలోమీటర్ల దూరం ర్యాలీని అనుమతిస్తారు. ఈ మూడూ కుండ్లీ-మనేసర్‌-పల్వాల్‌ ఎక్స్‌ప్రె్‌సవే వద్ద కలుస్తాయి. ఢిల్లీ నగరంలోనే 100 కి.మీ మేర ఇది సాగుతుంది.ఎన్ని ట్రాక్టర్లు ఏఏ పాయింట్ల నుంచి వస్తాయన్నది ముందుగానే నిర్ధారిస్తారు. ఢిల్లీ నగరంలో ఎక్కడికక్కడ అవుట్ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తారు.  ట్రాక్టర్లు ఆయా పాయింట్ల నుంచి మరలిపోవాలి. కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో వేలాది మంది  రైతులు కదం తొక్కారు. 21 జిల్లాల నుంచి ముంబైకి వచ్చారు. ఆజాద్‌ మైదాన్‌ వద్దకు భారీగా చేరుకుని  ధర్నాచేస్తున్నారు