కుటుంబ పార్టీలలో కొడుకులే వారసులు.. రాహుల్ నుంచి కేటీఆర్ వరకు అదే తీరు?

భారత రాజకీయలలో వారసత్వం కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వారసత్వ, కుటుంబ రాజకీయాలనే నమ్ముకుంది. నెహ్రూ గాంధీ కుటుంబ  వారసత్వం  పునాదిగానే  కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగిస్తోంది మధ్యమధ్యలో ఒకటి రెండు చిన్న బ్రేకులున్నా, కాంగ్రెస్ పార్టీ, నెహ్రు గాంధీ ఫ్యామిలీ పార్టీ అనే ముద్ర అలానే ఉండి పోయింది. నిజానికి, గాంధీ ఫ్యామిలీ  లేనిదే కాంగ్రెస్ పార్టీ లేదు, ఉండదు అనే అభిప్రాయం పార్టీలో నాటుకు పోయింది. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ పార్టీ బలమైనా బలహీనత అయినా నెహ్రూ గాంధీ కుటుంబమే అనే సూత్రీకరణ జరిగి పోయింది. అదొక రాజకీయ  నానుడిగానూ  స్థిరపడిపోయింది. 

ఇప్పుడు వారసత్వ రాజకీయాలు సర్వ సాధారణం అయి పోయాయి. ప్రాంతీయ పార్టీలన్నీ, కుటుంబ పార్టీలే, కుటుంబ పార్టీలన్నీ,వారసత్వ రాజకీయాలను కాదనలేని పార్టీలే. సో... ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పేటెంట్’ హక్కుగా ఉన్న వారసత్వ, కుటుంబ రాజకీయాలు ఇప్పుడు అందిరి హక్కుగా మారిపోయింది. కాంగ్రెస్, తెరాస పార్టీలలో వారసుల పట్టాభిషేకం గురించిన చర్చ జరుగుతోంది. సుమారు 20 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న సోనియాగాంధి వయసు దృష్ట్యా, ఆరోగ్యం దృష్ట్యా బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరుకుంటున్నారు. ఆలాగే, తెలంగాణలో20 ఏళ్లుగా అధ్యక్ష బాధ్యతలు మోస్తున్న తెరాస వ్యవస్థాపక అధ్యక్షడు కేసీఆర్’ కు ఇక విశ్రాంతి ఇవ్వలని కోడు కేటీఆర్ తొందరపడుతున్నారని అంటున్నారు.ఈ నేపధ్యంలో తెరాస అద్యక్ష పదవి కేటీఆర్ కు వారసత్వ హక్కుగా దక్క పోతోందనే మాట వినవస్తోంది. 

కాంగ్రెస్ పార్టీలోనూ అక్టోబర్ 16న జరిగే వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో సోనియా గాంధీ అధ్యక్ష పదవినుంచి తప్పుకుని, రాహుల్ గాంధీకి అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. నిజానికి, సోనియా గాంధీ 2019 ఎన్నికలకు ముందే కుమారుడు రాహుల్ గాంధీకి వారసత్వ అధికారాన్నిఅప్పగించారు. అంతకు  ముందు కొన్ని సంవత్సరాల పాటు రాహుల్ గాంధీని అధ్యక్ష పదవిలో కుర్చోపెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు.కుమార్తె  ప్రియాంకా వాద్రా బాధ్యతలు తీసుకునేందుకు సిద్దంగా ఉన్నా, సోనియా గాంధీ పుత్ర వాత్సల్యంతో వారసత్వ అధికారం కుమారుడికే దక్కాలనే బలమైన ఆకాంక్షతో ప్రియాంకకు అవకాశం ఇవ్వలేదు. చివరకు, 2019 లోక్ సభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఎలగోలా రాహుల్ గాంధీని అధ్యక్షుని చేసి ఒక తల్లిగా సోనియా చాలా ..చాలా మురిసి పోయారు. అయితే, ఆమె ఆనందం అట్టే కాలం నిలవలేదు.    

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. అధికారం మాట దేవుడెరుగు ప్రతిపక్ష హోదాకు కూడా దిక్కులేకుండా పోయింది. ఆ భయంకర ఓటమిని తట్టుకోలేకనో ఏమో రాహుల్ గాంధీ తొమ్మిది నెలలు అయినా నిండకుండానే  పార్టీ అధ్యక్ష పదివికి రాజీనామా చేశారు. కాడి దించేసి పలాయనం చిత్త గించారు. ఎవరు ఎంతగా బతిమాలినా, బామాలినా రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు ససేమిరా అనేశారు.చివరకు, మరో మార్గం లేక పార్టీ పగ్గాలు కుటుంబం చేతిలోంచి మరొకరి చేతిలో వెళ్ళడం ఇష్టం లేక మళ్ళీ ఆ భారాన్నిసోనియా గాంధీనే తాత్కాలికంగా తలకెత్తుకున్నారు. అప్పటినుంచి, ఇప్పటి వరకు కష్టనష్టాలు ఎన్ని ఎదురైనా, భరించారే కానీ, బాధ్యతలు స్వీక రించేందుకు సిద్దంగా ఉన్న ప్రియాంకా వాద్రాకు లేదా మరోకరికో  ఇవ్వలేదు.     

నిజానికి భారతీయ సమాజంలో, వారసత్వ హక్కులు కొడుకులకే కానీ, కుమార్తెలకు దక్కకపోవడం ఆచారంగా వస్తోంది. ఇద్దరూ సమానమే, ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయి అంటూ చట్టాలు చేసినా వాస్తవంలో, ‘కొడుకు కూతురూ ఇద్దరూ సమానమే, కొండుకులు కొంచెం ఎక్కువ సమానం’ అనే థియరీనే చలామణి అవుతోంది. ఇందుకు కుటుంబ పార్టీలు మినహాయింపు కాదు. నిజానికి  ఒక్క కాంగ్రెస్, ఒక్క సోనియా గాంధీ మాత్రమే, కాదు, వారసత్వ కుటుంబ పార్టీలో అన్నిటిలో, కొడుకులు కొంచెం ఎక్కువ సమానం ఆచారమే కొనసాగుతోంది.  

తెరాస విషయాన్నే తీసుకుంటే, ఉద్యమ పార్టీ కుటుంబ పార్టీగా రూపాంతరం చెందే క్రమంలో,మొదలైనా కుటుంబ వారసత్వ హక్కుల పోరాటం, ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కుమార్తె ఎమ్మెల్సీ కవిత మధ్య వారసత్వ వార్ ... చాలా కాలంగా సాగుతోందని వార్తలు వస్తూనే ఉన్నాయి. చివరకు అన్నా చెల్లి ముఖాముఖలు చూసుకోలేని స్థాయికి చేరిందని, తజా ఉదంతాలు ద్రువీకరిస్తున్నాయి అంటున్నారు. కేసీఆర్, ఎప్పుడూ బయటకు  కొడుకు కొంచెం ఎక్కువ సమానం, అని అనలేదు కానీ, ఎందుకనో కారణాలు ఏమిటో, ఎ వత్తిళ్ళు అయన మీద పనిచేస్తున్నాయో తెలియదు కానీ,  చేతల్లో మాత్రం, ఆ పక్షపాతం కనిపిస్తోంది. 

నిజానికి కేసీఆర్ కొడుకూ కూతురు ఇద్దరు ఒకే సారి, అమెరికా ఫ్లైట్ దిగారు, ఒకేసారి  రాజకీయ అరంగేట్రం చేశారు. అంతే కాదు ఉద్యమ సమయంలో కేటీఆర్ కంటే కవితే.. కొంచెం ఎక్కువ క్రియాశీలంగా వ్యవహరించారు. తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణ బతుకమ్మను, ప్రపంచ బతుకమ్మను చేశారు. తెలంగాణ ఉద్యమానికి వివిధ దేశాల్లోని ప్రవాస తెలంగాణ భారతీయుల మద్దతు కూడగట్టారు.ముఖ్యంగా ఉద్యమానికి, రాజకీయ కార్యకలాపాలకు అవసరమైన నిధులను సమకూర్చడంలో కవిత క్రియాశీల పాత్రను పోషించారు.  అయినా కేసీఆర్ కొడుకును ఎమ్మెల్యే, మంత్రిని చేశారు. బిడ్డను ఎంపీని చేసి అత్తారింటికి తోలినట్లు ఢిల్లీకి తోలారు. ఎంపీగా ఓడిన తర్వాత గుడ్డి గుర్రం పళ్ళు తోమేందుకు తప్ప ఇంకెందుకూ పనికి రాని ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టారు. మరో వంక కుమారుడు కేటీఆర్’ను మంత్రిని  చేశారు, పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుని చేశారు. రేపో మాపో అధ్యక్షుని ..ఆ తర్వాత ఓ మంచి ముహూర్తం చూసి ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్దమవుతున్నారు. అంటే రాజకీయ వారసత్వానికి కొడుకులే కాని, కూతుర్లు పనికి రారని కేసీఆర్ కూడా రుజువు చేస్తున్నారనే అనుకోవచ్చును. 

అలాగే ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో వైఎస్సార్ , పొరుగు రాష్ట్రం తమిళనాడులో కరుణానిధి, బీహార్లో లాలూ, యూపీలో ములాయం అందరూ  కూడా వారసత్వ రాజకీయ అధికారాన్ని కొడుకులకే అప్పగించారు. ఆడ పిల్లలను దూరంగానే  ఉంచారు. ఈ విషయంలో ఇంకెవరైనా ఉన్నారేమో తెలియదు కానీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, టీడీపీ అధినేత చంద్రబాబు అదృష్ట వంతులు.. ఆయనకు ఒకరే కుమార్తె, ఈయనకు ఒకరే కుమారుడు ... పోటీ లేదు ... ఎక్కువ తక్కువ విమర్శ అసలే లేదు.  ఈ ఇద్దరి కంటే ఒరిస్శా సీఎం నవీన్ పట్నాయక్, బగల్ సీఎం మమతా బెనర్జీ, బీస్పీపీ అధినేత్రి మాయావతి... మరింత అదృష్ట వంతులు...పెళ్ళీ లేదు ..పిల్లలు లేరు ... ఏక్ నిరంజన్ ..ప్రధాని మోడీ కూడా అంతే కానీ, బీజేపీలో ఇంకా వారసత్వ రాజకీయ సుగుణం మాత్రం ఇంకా రాలేదు.