స్ట్రెయిట్ ఫైట్ చేస్తా.. నీలాగా స్ట్రీట్ ఫైట్ చేయను : ఈటల

 

అబద్దాల పునాదులపై కొందరు బతుకుతున్నారంటూ మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బయటకొక మాట లోపలొకమాట మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ల పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈటల అన్నారు. మనకు వీధి పోరాటలు అవసరం లేదు. 20 ఏళ్లుగా హుజూరాబాద్ కార్యకర్తలు నా వెంటే ఉన్నారు. కొందరు సోషల్ మీడియాలో కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలను తిప్పికొట్టాలి అని ఈటల రాజేందర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శామీర్‌పేటలో హుజూరాబాద్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హుజూరాబాద్ త్యాగాలకు అడ్డా అని కొనియాడారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి అనేక పోరాటాలు చేశామని ఆయన గుర్తు చేశారు. 

కొంతమంది సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తన అభిప్రాయాలను కేసీఆర్‌కు మొహమాటం లేకుండా చెప్పేవాడినని తెలిపారు. తాను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశానని అన్నారు. తాను బీఆర్ఎస్‌ను వీడిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ఆత్మగౌరవం నిలబడిందని ఆయన వ్యాఖ్యానించారు.హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి చాలామంది కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో తాను అడుగు పెట్టని గ్రామాలు లేవని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వార్డు సభ్యులను గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాను పోరాటాలు చేయకుంటే కరీంనగర్ ప్రజలు అండగా ఉండేవారా అని ఆయన ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రులు రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ లాంటి వాళ్లతో తాను కొట్లాడానని.. వీరుడు ఎక్కడా భయపడడని  ఈటల రాజేందర్ అన్నారు. 

బీజేపీలో అన్ని రకాల అంశాలు పరిగణనలోకి తీసుకుంటారనే ఈ పార్టీలో చేరానని ఈటల చెప్పుకొచ్చారు. ఇక నుంచి అక్కడ స్ట్రైట్ ఫైట్ ఉంటుందని.. స్ట్రీట్ ఫైట్ మాత్రం ఉండదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలను దాటి తాను ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు. అప్పుడు కేసీఆర్ తన విషయంలో చేసింది అదేనని గుర్తుచేశారు. అయినా హుజురాబాద్ బిడ్డలు తనను కాపాడుకున్నారని ఉద్ఘాటించారు. తాను అలాగే వారిని కాపాడుకుంటానని మాటిచ్చారు. దక్షిణ భారతదేశంలో తన నియోజకవర్గానికి నేరుగా వచ్చి ప్రధాని మోదీ మీటింగ్ పెట్టారని ఈటల అన్నారు. శత్రువుతో కొట్లాడవచ్చు కానీ కడుపులో కత్తులు పెట్టుకొనే వారితో పోరాటం చేయలేమని విమర్శించారు.  తెలంగాణలో తాను తొక్కని ఇంటి గడప లేదని.. తనకు తెలియని వారు లేరని... బీసీ బిడ్డగా తాను మంత్రి పదవులు పొందానని గుర్తుచేశారు. దేశ ప్రధాని మోదీ వ్యక్తుల కోసం కాకుండా.. వ్యవస్థ నిర్మాణం కోసం పని చేస్తున్నారని నొక్కిచెప్పారు. మనమంతా దేశ ధర్మం కోసం కట్టుబడి పని చేయాలని పిలుపునిచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu