తెలంగాణలో ఎన్నికల సందడి సమాప్తం!

 

 

 

రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు జరగనున్న తెలంగాణ ప్రాంతంలో సోమవారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియనుంది. 30వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత ఓటర్ల ఇళ్లకు వెళ్లి పలుకరించడం.. ర్యాలీలు..రోడ్‌షోలు.. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు అన్నిటినీ నిలిపివేయాలని ఎన్నికల సంఘం అన్ని రాజకీయపార్టీలను ఆదేశించింది. ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయి. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ జూన్2న ఆవిర్భవించనున్న తరుణంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు ఈసారి ప్రత్యేకంగా దృష్టిసారించాయి. కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఎన్నికల ప్రచారానికి అతిరథ మహారథులను రంగంలోకి దించాయి. మొత్తంమీద మూడు వారాల ప్రచార సంరంభానికి తెరపడనుంది.