గంగులకు ఈడీ షాక్.. రివేంజ్ పాలిటిక్స్? దూకుడు బండి..!
posted on Aug 4, 2021 3:27PM
హుజురాబాద్ కేంద్రంగా రాజకీయ వేడి మరింత పెరిగింది. ఈటలపై తెలంగాణ సర్కారు భూఆక్రమణ కేసులు పెడితే.. మంత్రి గంగుల కమలాకర్‌కు గ్రానైట్ అక్రమ రవాణాపై ఈడీ నోటీసులు ఇచ్చింది. రాష్ట్ర పరిధిలో ఈటలపై టీఆర్ఎస్ తన పవర్ ప్రయోగిస్తే.. కేంద్ర పరిధిలో గంగులపై బీజేపీ ఈడీని ఉసిగొల్పిందని అంటున్నారు. గంగుల కంపెనీలపై గతంలో బండి సంజయ్ చేసిన ఫిర్యాదు కూడా కారణమని తెలుస్తోంది. ఇలా రివేంజ్ పాలిటిక్స్‌తో తెలంగాణ రాజకీయం మరింత రంజుగా మారింది.
ఈటలను కారు నుంచి గెంటేయడానికి అసైన్డ్ భూముల కేసును తెరపైకి తీసుకొచ్చింది కేసీఆర్ సర్కారు. వెంటనే కమిటీ వేసి.. ఈటలను కేబినెట్ నుంచి వెళ్లగొట్టి.. పార్టీ నుంచే వెళ్లిపోయేలా చేశారు. ఆనాటి నుంచి ఈటలపై దాడికి మంత్రి గంగులను ముందుంచింది. రాజేందర్ బీజేపీలో చేరి.. టీఆర్ఎస్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్టున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ తాజాగా మంత్రి గంగుల కమలాకర్ కంపెనీలకు నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది.
కరీంనగర్‌లో గ్రానైట్ అక్రమ రవాణపై ఈడీ కొరడా ఝులిపించింది. హుజురాబాద్ ఉప ఎన్నిక ముంగిట మంత్రి గంగుల కమలాకర్‌కు ఊహించని షాక్ తగిలింది. మంత్రికి సంబంధించిన గ్రానైట్ కంపెనీలకు ఈడీ నోటీసులిచ్చింది. గంగులకు చెందిన శ్వేత ఏజెన్సీతో పాటు మరో 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులివ్వడం రాజకీయ ప్రతీకార చర్యేనంటున్నారు.
ఫెమా నిబంధనలు ఉల్లంగించారంటూ గంగులపై.. గతంలో ఎంపీ బండి సంజయ్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై తాజాగా ఈడీకి ఇద్దరు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. తక్కువ పరిణామం చూపించి.. ఎక్కువ మొత్తంలో గ్రానైట్ ఎగుమతి చేసినట్టు కంప్లైంట్ చేశారు. ఆ ఫిర్యాదు మేరకు.. విదేశాలకు ఏ మేరకు ఎగుమతి చేశారో చెప్పాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది.
గనులశాఖ నుంచి అనుమతి పొందిన దానికంటే ఎక్కవ గ్రానైట్‌ను విదేశాలకు సరఫరా చేస్తున్నట్టు ఈడీకి ఫిర్యాదులు అందాయి. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఏపీలోని కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, విశాఖ పోర్టులకు వెళ్లి ఆ మేరకు పరిశీలన చేసినట్లు తెలుస్తోంది. లెక్కల్లో చూపిస్తున్న దానికి విదేశాలకు ఎగుమతి చేస్తున్న గ్రానైట్‌కు భారీ తేడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పక్కా సమాచారంతోనే ఈడీ రంగంలోకి దిగిందని.. గంగుల కమలాకర్‌కు చెందిన గ్రానైట్ రవాణా కంపెనీలకు నోటీసులు ఇచ్చారని అంటున్నారు. కరీంనగర్ ప్రాంత గ్రానైట్ అక్రమాలపై ఈడీతో పాటు సీబీఐకి కూడా ఫిర్యాదులు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈడీతో పాటు సీబీఐ కూడా రంగంలోకి దిగే అవకాలునట్టు తెలుస్తోంది.
ఈటల వర్సెస్ గంగుల మాత్రమే కాదు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోనూ గంగులకు ఏళ్లుగా రాజకీయ వైరం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్.. గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఎంపీగా గెలవడం, పార్టీ పగ్గాలు చేతికి రావడంతో బలవంతుడిగా మారిన బండి.. తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి గంగులకు వ్యతిరేకంగా పావులు కదపడం స్టార్ట్ చేశారు. గతంలోనే సంజయ్.. గంగుల గ్రానైట్ దందాపై కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. అందుకు కౌంటర్‌గా బండి సంజయ్ గ్రానైట్ వ్యాపారుల నుంచి కోట్లు వసూలు చేశారంటూ గంగుల వర్గం ఆరోపించింది. ఇలా వీరిద్దరి మధ్య రచ్చ రగులుతుండగానే.. ఈటల ఎపిసోడ్ మొదలవడం.. రాజేందర్‌పైనా మంత్రి గంగుల దూకుడుగా వ్యవహరిస్తుండటంతో.. ఇక ఆలస్యం చేయకుండా ఆయనకు చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయ ప్రోద్బలం ఉందోలేదో తెలీదుకానీ(?).. కరీంనగర్-హుజురాబాద్ రాజకీయం హాట్‌హాట్‌గా సాగుతున్న ఈ సమయంలోనే గంగుల కంపెనీలకు ఈడీ నోటీసులు ఇవ్వడం పొలిటికల్‌గా కలకలం రాజేస్తోంది.