రాబర్ట్ వాద్రాపై ఈడీ చార్జిషీట్
posted on Aug 11, 2025 11:19AM

కాంగ్రెస్ కీలక నేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. 2008 నాటి గురుగ్రామ్ భూముల కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో వాద్రాకు గరిష్ఠంగా ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించాలని కోరుతూ ఈడీ ఢిల్లీలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. అలాగే.. ఈ కేసుకు సంబంధించి రూ. 38.69 కోట్ల విలువైన 43 ఆస్తులను ప్రభుత్వపరం చేయాలని ఆ చార్జిషీట్ లో పేర్కొంది. ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌ను పరిశీలించిన ప్రత్యేక కోర్టు.. రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈడీ చార్జ్ షీట్ పై విచారణ అంశాన్ని ఈ నెల 28కి వాయిదా వేసింది.
గురుగ్రామ్‌లోని భూమి అమ్మకానికి సంబంధించి రాబర్ట్ వాద్రా తప్పుడు వివరాలతో దస్తావేజులు సృష్టించారని ఈడీ తన చార్జిషీట్‌లో ఆరోపించింది. భూమి విలువను ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపారనీ, దీనివల్ల హర్యానా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ రూపంలో రూ. 44 లక్షల నష్టం వాటిల్లిందని పేర్కొంది. అంతే కాకుండా ఈ లావాదేవీల ద్వారా రాబర్ట్ వాద్రా 58 కోట్ల రూపాయలు అక్రమంగా పొందారని, ఇది మనీలాండరింగ్ ద్వారా వచ్చినట్లు తమ దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొంది