ఈసారి పన్నుల మోతే... బడ్జెట్ పై కేసీఆర్ డైరెక్షన్...
posted on Dec 30, 2019 9:50AM
.jpg)
2020-21 బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జనవరి తొమ్మిదిలోగా ప్రతిపాదనలు ఇవ్వాలని అన్ని శాఖలకు సూచించింది. ఆర్ధిక మాంద్యం ప్రభావం కారణంగా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ ప్రిపరేషన్ చేపడుతున్నారు. ఆర్ధిక మాంద్యం ఎఫెక్ట్ తో గతేడాది బడ్జెట్‌లో అంచనాలు అవసరాల కంటే 35వేల కోట్లను ప్రభుత్వం తగ్గించుకుంది. అందుకే, ఈసారి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్ధికశాఖ అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.
అయితే, ఫిబ్రవరి మూడో వారంలోగా బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశమున్నందున... జనవరి తొమ్మిదిలోపే ప్రతిపాదనలు ఇవ్వాలని ఆయా విభాగాలను ఆర్ధికశాఖ కోరింది. అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు అందిన తర్వాత బడ్జెట్‌పై ఆర్ధికశాఖ కసరత్తు చేయనుంది. అలాగే, మున్సిపోల్స్ ముగిసిన తర్వాత బడ్జెట్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ సమీక్ష చేసే అవకాశం కనిపిస్తోంది.
తీవ్ర ఆర్ధిక మాంద్యం కారణంగా గతేడాది బడ్జెట్ అంచనాలను అందుకోలేకపోయారు. అయితే, ఈ ఏడాది కూడా ఆర్ధిక మాంద్యం పరిస్థితులు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. దాంతో, ఆర్ధిక లోటును పూడ్చుకునేందుకు ఈసారి పన్నుల మోత మోగే అవకాశముందంటున్నారు.