హేమంత్ సొరేన్ కు ఈసీ షాక్

 కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ జార్ఖండ్ సీఎంకు హేమంత్ సొరేన్ కుషాక్ ఇచ్చింది.  ఆయనపై అనర్హత వేటు వేయాలని సూచిస్తూ   ఝార్ఖండ్ గవర్నర్‌ రమేశ్ బియాస్‌ కు లేఖ రాసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తనకు తానుగా గనులను సీఎం కేటాయించుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని విశ్వసనీయంగా తెలిసింది. తన అభిప్రాయాన్ని ఎన్నికల కమిషన్ సీల్డ్ కవర్‌లో ఝార్ఖండ్ రాజ్‌భవన్‌కు  పంపింది.  

ప్రభుత్వ కాంట్రాక్టుల విషయంలో ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని  సెక్షన్ 9-ఏను హేమంత్ సోరెన్  ఉల్లంఘించారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 192 ప్రకారం ఒక శాసన సభ్యుడు ఏదైనా అనర్హతలకు లోబడి ఉన్నారా? లేదా? అనే ప్రశ్న తలెత్తితే ఈ అంశాన్ని గవర్నర్‌కు పంపుతారు. ఆయన నిర్ణయమే అంతిమంగా ఉంటుంది. ఇటువంటి అంశాలపై నిర్ణయం తీసుకునే ముందు ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని గవర్నర్ కోరతారు.  

 దీని నేపథ్యం అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ సన్నిహితుడు ప్రేమ్ ప్రకాశ్ హస్తం ఉందని అనుమానించి ఈడీ.. కొన్నాళ్ల కిందట అతడి నివాసంలో సోదాలు నిర్వహించిన సందర్భంగా  ఏకే 47 రైఫల్స్   బయటపడ్డాయి. ఇక, మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన ఝార్ఖండ్, బిహార్, తమిళనాడు, ఢిల్లీలో పలు చోట్ల తనిఖీలు చేపట్టిన ఈడీ  సీఎం హేమంత్ సోరెన్‌కు రాజకీయ సన్నిహితుడు పంకజ్ మిశ్రా,  బచ్చు యాదవ్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సోదాల్లో  కోట్లాది రూపాయలు విలువైన ఆస్తులు,  బ్యాంకు ఖాతాల్లో రూ.13.32 కోట్ల నగదును జప్తు చేసిన సంగతి విదితమే. అయితే హూమంత్ సొరేన్ కు ఈసీ ఇచ్చిన షాక్   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒకింత ఇబ్బందికరమైన అంశమే నని పరిశీలకులు అంటున్నారు.

కేసీఆర్ జాతీయ రాజకీయ ఆకాంక్షలకు మద్దతు ఇచ్చిన బీజేపీయేతర నేతలలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ముఖ్యులు. ఈ నేపథ్యంలోనే గత ఏప్రిల్ 28న హేమంత్ సొరేన్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. అంతకు ముందు అంటే మార్చి నెలలో సీఎం కేసీఆర్ రాంచీ వెళ్లి హేమంత్ సొరేన్ తో భేటీ అయ్యారు.   మళ్లీ  నెల రోజుల వ్యవధిలోనే ఇరువురు సీఎంలూ రెండో సారి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు సందర్బాలలోనూ జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటు విషయంపై ఇరువురి మధ్యా చర్చ జరిగిందని చెబుతున్నారు.

 అంతే కాకుండా ‘మేఘా’సహా మరో రెండు కంపెనీలకు జార్ఖండ్ లో కాంట్రాక్టుల విషయంపై సీఎం కేసీఆర్  జార్ఖండ్ సీఎంకు సిఫారసు చేశారనీ, వీరిరువురి మధ్యా ఈ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చిదనీ కూడా అప్పట్లో వార్తలు వినవచ్చాయి.  త్వరలోనే జార్ఖండ్ లో మేఘా కంపెనీ, మరో రెండు కంపెనీలకు కాంట్రాక్టులు లభించే అవకాశాలు ఉన్నాయని అప్పట్లో రాజకీయ వర్గాలలో బాగా ప్రచారమైంది. అలాగే హేమంత్ సొరేన్ తన తల్లి వైద్యం కోసమే గత ఏప్రిల్ లో హైదరాబాద్ వచ్చారనీ, హైదరాబాద్ కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్  డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఆయన తల్లికి వైద్యం చేశారనీ, డాక్టర్ నాగేశ్వరరెడ్డితో కేసీఆర్ స్వయంగా మాట్లాడి మరీ హేమంత్ సొరేన్ తల్లికి వైద్యం నిమిత్తం అప్పాయింట్ మెంట్ ఫిక్స్ చేశారనీ అంటున్నారు.  

మొత్తం మీద తెలంగాణ సీఎం కేసీఆర్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయనీ రాజకీయవర్గాలు చెబుతుంటాయి. ఈ నేపథ్యంలోనే అక్రమ మైనింగ్ వ్యవహారంలో హేమంత్ సొరేన్ పై ఈసీ అనర్హత వేటు వేయడం కేసీఆర్ రాజకీయ ఆకాంక్షల విషయంలో పెద్ద ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంటుందని అంటున్నారు.

అన్నిటికీ మించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సన్నిహితంగా మెలిగిన వారికి ఏదో విధంగా రాజకీయంగా నష్టం వాటిల్లడం మామూలైపోయిందనీ, ఆ కారణంగానే కేసీఆర్ తో రాజకీయంగా చేతులు కలిపేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్ధితి ఏర్పడిందని రాజకీయ వర్గాలలో ఓ చర్చ అయితే ఎప్పటి నుంచో నడుస్తోంది. ఇప్పుడు దానికి బలం చేకూర్చే విధంగా జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ చిక్కుల్లో పడి పదవి కోల్పోయి పరిస్థితికి వచ్చారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu